IPL 2025 CSK vs MI Highlights | ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం నాడు రివేంజ్ డ్రామా ముగిసింది. మొదట నేటి సాయంత్రం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో మొన్నటి ఓటమికి పంజాబ్ కింగ్స్‌ జట్టు మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. రాత్రి ముంబైలోని వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. సొంతగడ్డపై ముంబై బ్యాటర్లు చెలరేగగా చెన్నైపై మరో 26 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. నేడు రివేంజ్ గేమ్ తో ముంబై ప్రతీకారం తీర్చుకుంది. తాజా ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ తగ్గేదేలే అనే రీతిలో ఆడింది. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో కేవలం 15.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి సొంతగడ్డ వాంఖేడేలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్, సూర్యల వికెట్లు తీసేందుకు ధోనీ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. ఈ ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తూ వాంఖేడేలో వీర విహారం చేశారు.

 

సీఎస్కే బౌలర్లలో జడేజా ఒక్క వికెట్ తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం లీగ్ తరువాత మ్యాచ్‌లలో ముంబైకి కలిసొస్తుంది.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కేకు మంచి ఆరంభం రాలేదు. రచిన్ రవీంద్ర (5)ను అశ్వనీకుమార్ ఔట్ చేశాడు. వన్ డౌన్‌లో వచ్చిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే ఐపీఎల్ అరంగేట్రం అదిరింది. కేవలం 15 బంతులాడిన ఆయుష్ మాత్రే (15 బంతుల్లో 32 పరుగులు) 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో మాత్రే షాట్ ఆడిన బంతిని శాంట్నర్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. నిన్న వైభవ్ ఆరోరా ఇదే తీరుగా కాన్ఫిడెన్స్ చూపగా.. నేడు మరో యువ సంచలనం ఆయుష్ మాత్రే సైతం అనుభవం ఉన్న ఆటగాడిలా ఏ తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.

 

 

రాణించిన జడేజా, దుబేగత మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. 20 బంతులాడిన రషీద్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆల్ రౌండర్ జడేజా (35 బంతుల్లో 53 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివం దుబే (32 బంతుల్లో 50, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (4) తన అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. హాఫ్ సెంచరీ అనంతరం దుబే ఔట్ కాగా, జేమీ ఓవర్టన్ (4 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. ఒక్క ఫోర్ కొట్టాడు. దాంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. చహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.