Sri Lanka Emergency: పరిస్థితులు మరింత దిగజారడంతో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు  ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Sri Lanka President Gotabaya Rajapaksa). నిత్వావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, ఆసుపత్రుల్లో ఔషధాలు లేక, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తుండటం, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అత్యవసర పరిస్థితి (Sri Lanka State of Emergency)ని విధించినట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి గొటబోయ రాజపక్స గెజిట్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌‌లో పేర్కొన్నారు.


అధ్యక్ష భవనం ఎదుట ఆందోళనలు.. 
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు 10 గంటల విద్యుత్ కోతలు తాజాగా 13 వరకు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా  శ్రీలంకలో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజపక్స అత్యవసర పరిస్థితికి నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు రాజపక్స కారణమని నిరసనకారులు ఆందోళనకు దిగారు. అధ్యక్ష భవనం ఎదుట పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట సైతం జరగడంతో కొందరికి గాయాలయ్యాయి.


అసలేం జరుగుతోంది.. 
శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి కొంతకాలం (Sri Lanka Power Crisis) కిందటే నిలిచిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఇంధన కొరత. దీని వల్లే విద్యుత్ లేక కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ పవర్ కట్ సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రోజుకు 7 గంటలు విధిస్తోన్న కరెంట్ కోతను బుధవారం నుంచి 10 గంటలకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఆపై దేశవ్యాప్తంగా రోజుకు 13 గంటల పాటు కరెంట్ కోతలు విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో అధ్యక్ష భవనం వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడంతో ఎమర్జెన్సీ (Emergency In Sri Lanka) ప్రకటించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.


ధరల పెరుగుదలతో ప్రజలు విలవిల.. 
శ్రీలంక ప్రస్తుతం ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ప్రస్తుత ధరలు చూస్తే కళ్లు పైర్లు కమ్ముతాయి. కోడి గుడ్డు రూ.35, లీటర్​ కొబ్బరి నూనె రూ.900, కిలో చికెన్​ రూ.1000, కిలో పాల పొడి రూ.1945.. ఇవి ప్రస్తుతం శ్రీలంకలో నిత్యవసర ధరల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.


1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి శ్రీలంకలో ఈ ధరల మోత ఎప్పటికి అదుపులోకి వస్తుందో!


Also Read: Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు- నిమ్స్‌లో చికిత్స


Also Read: Vanastalipuram Police: ఆ దేవుడు ఆదేశిస్తాడట- ఈ రాజేంద్రుడు పాటిస్తాడట- దొంగలందు ఈ దొంగ స్టైలే వేరు