దాదాపు 43 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు.. అతని చెప్పే విషయాలు చూసి షాక్ తిన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లక గాంధీనగర్‌కు చెందిన ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు, అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్ ఎలక్ట్రీషియన్‌గా చిన్న చిన్న పనులు చేస్తూ జీవించేవాడు. అతని ఖర్చులకు సరిపడా జీతం రాకపోయేసరికి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. అందులోనూ ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్నాడు.
1989లో చోరీలు మొదలు పెట్టాడు ఈ వ్యక్తి. కర్ణాటకలో చోరంగేట్రం చేసి... క్రమంగా హైదరాబాద్ వచ్చేశాడు. 1991లో లాలా గూడ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు.
జైలు నుంచి వచ్చిన తర్వాత 21 ప్రాంతాల్లో చోరీలు చేశాడు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో 21కేసులు రిజిస్ట్రర్ అయ్యాయి. మళ్లీ అరెస్టు అయ్యాడు. అప్పుడు కూడా తన బుద్ది మార్చుకోలేదు.
రెండోసారి అరెస్టు అయి విడుదలైన తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. విజయవాడ హైవేకు ఆనుకొని ఉన్న వనస్థలిపురంలో దొంగతనాలు చేయడం ఈజీగా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక్కడే ఎక్కువ దొంగతనాలు చేశాడు.
ఇతనిపై ఇప్పటి వరకు 43 కేసులు నమోదు అయ్యాయి. ఇలా చోరీలు చేస్తూనే గుంటూరులో మూడంతస్తుల భవన్ కట్టినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలు విక్రయించకుండా ఇంట్లోనే దాచుకున్నాడు. అమ్మితే దొరికిపోతానని ఇలా చేసేవాడు.
దొంగతనాలు ఎందుకు, ఎలా చేస్తున్నావని పోలీసులు ప్రశ్నిస్తే చాలా విచిత్రమైన సమాధానం చెప్పాడు. దొంగతనం ఎక్కడ చేయాలో ముందురోజు కల వస్తుందని.. ఆ తర్వాత రోజు అక్కడే చోరీ చేస్తానని చెప్పాడు. దేవుడే ఇది చేపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
నిందితుడి నుంచి పోలీసులు కోటీ 30లక్షలు విలువైన బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నాడు.