Ginger In Summer | వేసవిలో అల్లం తినడమా? అమ్మో మా వల్ల కాదని అనుకుంటున్నారా? అయితే, మీరు అల్లం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అల్లమనేది ఆరోగ్యానికి మూలం. ఎన్నో దశాబ్దాల నుంచి అల్లాన్ని ఆయుర్వేదంలో వాడుతున్నారు. అంతేగాక ఇది మన వంటగదిలో ముఖ్యమైన ఆహారం పదార్థం కూడా. దీన్ని వెల్లులి, లవంగాలతో కలిపితే రుచితోపాటు వాటిలోని ఔషద గుణాలన్నీ శరీరానికి అందుతాయి. అల్లం యాంటీ-మైక్రోబయల్‌తో నిండి ఉంటుంది. అల్లంలోని డయాపోరేటిక్ చర్య వల్ల శరీరానికి వేడి లభిస్తుందని అంటారు. అందుకే, వేసవిలో అల్లం తినడం సురక్షితమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. 


రోజుకు ఎంత తీసుకోవాలి?: ఆహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లం జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే అల్లం, నిమ్మరసం, తేనె కలిపి తింటే ఆరోగ్యం లభిస్తుంది. అల్లం వల్ల కలిగే వేడి మనకు చెమట పట్టేలా చేస్తుంది. అది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి, అల్లం మంచిదనే ఉద్దేశంతో అతిగా తినేయకుండా.. కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వేసవిలో రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని తినకూడదు. అంటే అర అంగుళం ముక్క అల్లం.. మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.  


ఈ సమస్యలుంటే వద్దు: రక్తస్రావం సమస్య లేదా డయాబెటిస్‌తో బాధపడేవారు వేసవిలో అల్లం తీసుకోవడం మానేయాలి. ఇది శరీరంలోని వేడిని పెంచినప్పుడు శరీరం అదుపుతప్పుతుంది. మీకు ఏవైనా అంతర్లీన సమస్యలు ఉన్నట్లయితే.. అల్లాన్ని తీసుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. భోజనానికి 15 నిమిషాల ముందు అల్లం టీ తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చెమట వల్ల బరువు తగ్గుతారు. అల్లాన్ని చేర్చడం వల్ల శరీరానికి మరింత బాగా చెమటపట్టి ఆ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.


అల్లం టీతో ప్రయోజనాలు: అల్లం టీ చాలా మంచిది. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చర్మ ఆరోగ్యానికి గొప్ప సప్లిమెంట్‌గా పనిచేస్తాయి. వేసవిలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షణ లభిస్తుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. అల్లం జీర్ణక్రియకు ఒక వరం. వేసవిలో వచ్చే అజీర్ణం, ఉబ్బరం మొదలైన కడుపు సమస్యల నుంచి ఉపశమనానికి అల్లం సహాయపడుతుంది. వేసవిలో జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, రోజూ అల్లం టీని తాగడం బెటర్. అల్లాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే మేలు జరుగుతుంది. 


Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?


అల్లం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు: 
☀ అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి(ఇమ్యునిటీ)ని పెంపొందిస్తుంది.
☀ దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం మంచిది. కానీ, వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. 
☀ వికారంగా కాస్త అల్లాన్ని నోట్లో పెట్టుకుని నమలండి.  
☀ కండరాల నొప్పి నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ సమస్యలకు అల్లం మంచి మందు. 
☀ అల్లంలో ఉండే జింజెరోల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఫలితంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవచ్చు.
☀ అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియలో ఎక్కువ కేలరీలను ఖర్చు చేయిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
☀ డయాబెటీస్ బాధితుల రక్తంలో చక్కెర స్థాయిలను అల్లం నియంత్రిస్తుంది. కానీ, దీన్ని తీసుకోవాలంటే వైద్యుడిని సంప్రదించాలి. 


Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!


గమనిక: అవగాహన కోసమే ఈ వివరాలను మీకు అందించాం. అల్లాన్ని మీ డైట్‌లో చేర్చుకొనే ముందు వైద్యులు లేదా ఆహార నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని మనవి.