Protein Food Side Effects | ‘అతి’ ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహారం విషయంలో అది అస్సలు మంచిది కాదు. ఇటీవల చాలామంది ‘ప్రోటీన్’ ఫుడ్స్‌ను ఎక్కువగా తింటున్నారు. అయితే, ఇది ఆరోగ్యానికి మంచిదే. పైగా మన శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం కూడా. అయితే, వారి శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలనే సంగతి తెలియక చాలామంది కావల్సిన దాని కంటే ఎక్కువగానే లాగించేస్తున్నారు. కొందరికి ప్రోటీన్లు తీసుకోవలనే ఉద్దేశం లేకపోయినా.. నాన్-వెజ్‌పై ఉండే ప్రేమతో మాంసాహారాన్ని అతిగా తింటున్నారు. అయితే, ఇది ఎప్పటికైనా ప్రమాదకరమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించే పురుషులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ ప్రోటీన్ల శాతం పెరిగితే.. పడక గదిలో పిల్లల కోసం ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఫలితం ఉండదని, స్వశక్తితో సంతాన సాఫల్యం కష్టమేనని చెప్పేస్తున్నారు. ఎందుకంటే..
హైపోగోనాడిజం సమస్య తప్పదు: యూనివర్శిటీ ఆఫ్ వోర్సెస్టర్‌లో నిర్వహించిన తాజా పరిశోధనలో ప్రోటీన్ ఫుడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధిక ప్రోటీన్ ఆహారం పురుషులలో టెస్టోస్టెరాన్‌ను 37 శాతం తగ్గిస్తుందని కనుగొన్నారు. వైద్యపరంగా దీన్ని హైపోగోనాడిజం అంటారు. అదే ఏర్పడితే ఇక పిల్లలను కనడం కష్టమవుతుంది. ఎందుకంటే.. తక్కువ టెస్టో్స్టెరాన్ సమస్యలు స్మెర్మ్ (వీర్యంలోని శుక్రకణాలు) కౌంట్‌ను బాగా తగ్గిస్తాయని వెల్లడించారు. ఫలితంగా పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
గుండె జబ్బుల ప్రమాదం: ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడు, పోషకాహార నిపుణుడు జో విట్టేకర్ ఓ వీడియో సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మా స్టడీలో అధిక ప్రోటీన్ ఆహారాలు టెస్టోస్టెరాన్‌కు కారణమవుతున్నట్లు తేలింది. అవి తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు కూడా కారణమయ్యాయి. దాని వల్ల పురుషుల్లో పిల్లలను పుట్టించే శక్తి తగ్గిపోతుంది. అయితేకాదు, తక్కువ తక్కువ టెస్టోస్టెరాన్ గుండె జబ్బులు, డయాబెటీస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణం కావచ్చు’’ అని తెలిపారు.
‘ప్రోటీన్ పాయిజనింగ్’ అంటే?: అకాడెమిక్ జర్నల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్‌లో ప్రచురించబడిన వివరాల ప్రకారం.. ప్రోటీన్ అమ్మోనియాగా విచ్ఛిన్నం కావడం వల్ల విషపూరితంగా మారుతుంది. దీన్నే ‘ప్రోటీన్ పోయిజనింగ్’ అని అంటారు. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గించి, ప్రోటీన్ పాయిజన్‌ను శరీరమంతా ఆక్రమించేలా చేస్తుంది. విక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ టెస్టోస్టెరాన్‌తో బాధపడేవారిలో వికారం, విరేచనాలు ఏర్పడతాయి. లైంగిక కోరికలు తగ్గుతాయి. ఫలితంగా పడక గదికి దూరమవుతారు. దీన్నే ‘స్టోస్టెరాన్’ అని అంటారు. ప్రోటీన్ విషపూరిత లక్షణాలు బయట పడేందుకు ఒకటి నుంచి రెండు వారాల సమయం పడుతుంది.
పరిశోధనలో ఏం తేలింది?: ఈ అధ్యయనం కోసం విట్టేకర్, ఆయన సహచరులు 309 మంది పురుషులు పాల్గొన్న 27 అధ్యయనాల ఫలితాలను పరిశీలించారు. అధిక ప్రోటీన్ ఆహారాలు, కార్బోహైడ్రేట్‌లు కలిగిన ఆహారం టెస్టోస్టెరాన్‌ను ప్రభావితం చేస్తాయయని, కార్టిసాల్‌ను పెంచుతాయని తెలుసుకున్నారు. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం.. అంటే మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పులు నుంచి 35 శాతం వరకు కేలరీలు శరీరానికి అందాయి. ఉదాహరణకు.. ఒకరు రోజుకు 2,500 కేలరీల ఆహారాన్ని తింటే.. అందులో నుంచి 865 కేలరీలు ప్రోటీన్ల ద్వారా లభిస్తాయి.
ప్రోటీన్ మోతాదు పెరిగితే..: ప్రస్తుతం ఒక శాతం మంది పురుషులే ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటున్నట్లు విట్టేకర్ తెలుసుకున్నారు. వీరంతా కండలను పెంచుకోవడం కోసమే ప్రోటీన్ షేక్‌ల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. బాడీబిల్డర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఇలాంటి డైట్‌లు తీసుకోవడం వల్లే సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రోటీన్ విషమయంగా మారినవారిలో తరచుగా కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు వారాల్లో 35 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే.. అది ఆరోగ్యానికే ప్రమాదకరం.
Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?
ఎంత శాతం ప్రోటీన్లు తీసుకోవడం సురక్షితం?: విట్టేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోటీన్‌లు తీసుకోవడం మంచిదే. కానీ, అది 15 నుంచి 25 శాతానికి మాత్రమే పరిమితమై ఉండాలి. పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందుగా చేయాల్సిన పని.. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం. తరచుగా వ్యాయామం చేస్తూ.. మాంసం, చేపలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, గింజలను తీసుకోవడం ద్వారా పోషకాలను పొందవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఫుడ్‌కు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలను అస్సలు ముట్టొద్దు. పోట్రీన్‌లు శరీరంలో కండరాలను రిపేర్ చేస్తాయి. కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బరువు పెరిగే సమస్య ఉండదు. కిమ్ కర్దాషియాన్, లెబ్రాన్ జేమ్స్, మీగన్ ఫాక్స్ వంటి సెలబ్రిటీలు కూడా ప్రోటీన్లను తీసుకుంటారు. అయితే, వారు మోతాదు మించకుండా జాగ్రత్తపడతారు. బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మన శరీర బరువు ఆధారంగా ప్రోటీన్లు తీసుకోవాలని సూచించింది. ఉదాహరణకు ఒక కిలో శరీర(పెద్దలు) బరువుకు 0.75 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. చూశారుగా.. ఇప్పటికైనా ప్రోటీన్లను తీసుకొనే ముందు అజాగ్రత్తగా ఉండకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోండి.
Also read: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే
గమనిక: అధ్యయనం, నిపుణులు పేర్కొన్న వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. డైట్ విషయంలో మీరు తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు పాటించారు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించవు.