Warm Water Bath In Summer: మీకు సీజన్‌తో సంబంధం లేకుండా వేడి నీటి స్నానం చేయడం అలవాటా? భగభగలాడే వేసవి(Summer)లో కూడా వేడి నీటి స్నానం చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసం కాదు. వేసవిలో వేడి నీటి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని భావించేవాళ్లకు. 


వేసవి వేడిలో వేడి స్నానమా? వామ్మో అనుకుంటున్నారా? వేడి స్నానమంటే మరిగిన నీళ్లను మీద పోసుకోవడం కాదు. ఏ సీజన్లోనైనా గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. వేసవిలో వేడి నీటి స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. 


వాస్తవానికి వేసవిలో చల్లని నీటితో స్నానం చేయడం చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే, మన దేశంలో చాలామంది వేసవిలో చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మన పూర్వికులు కూడా తెల్లవారుజామునే చన్నీటి స్నానం చేయడానికే ఇష్టపడేవారు. అయితే, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనట. మరి, వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో చూసేయండి మరి.


వేడి నీటి స్నానం కండరాలను రిలాక్స్ చేస్తాయి: మనం రోజంతా డెస్కుల ముందు కూర్చొని పనిలో బిజీ బిజీగా గడిపేస్తుంటాం. దీని వల్ల కండరాలు పట్టేస్తాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీరు తప్పకుండా వేడి నీటి స్నానం చేయండి. వేడి నీటి స్నానం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పులు కూడా తగ్గుతాయి. వేసవి కాలంలో చాలామంది ఎయిర్ కండీషనర్(ఏసీ) వేసుకుని నిద్రిస్తాం. దానివల్ల జలుబు, తుమ్ములు లేదా దగ్గు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా ఉండాలంటే ఉదయాన్నే వేడి నీటి స్నానం చేయడమే ఉత్తమం. బారెడ్డు పొద్దెక్కి, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మాత్రం వేడి నీటి స్నానం వద్దని నిపుణులు చెబుతున్నారు. 


ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్ర బాగా పడుతుంది: రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాదు, వేడి స్నానం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది. అన్నీ మరిచిపోయి హాయిగా నిద్రపోవచ్చు. మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


చర్మం శుభ్రంగా ఉంటుంది: వేడి నీటి స్నానం వల్ల చర్మం బాగా శుభ్రమవుతుంది. వేడి నీరు మీ చర్మం మీద రంధ్రాలను తెరుస్తుంది. మరింత లోతుగా శుభ్రం చేస్తుంది. దాని వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్మలు తగ్గుతాయి. 


Also Read: డయాబెటిక్ రోగులకు శుభవార్త, రోజూ కాఫీ తాగితే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు


ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వేడీ నీరు మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి, మరిగే నీటితో స్నానం వద్దు. గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయండి. అలాగే, బాగా మరిగిన నీటితో తలస్నానం చేస్తే తల పొడిబారి చుండ్రు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకే రోజు రోజు పదే పదే వేడి నీటి స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది.


Also read: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే


గమనిక: మీరు ఏదైనా దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలు లేదా చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.