తెలంగాణలో గవర్నర్(Telangana Governor), సీఎం(Telangana CM) మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ హాజరుకావడం లేదు. ఇప్పుడు రాజ్‌భవన్(Raj Bhavan)లో జరిగిన ఉగాది వేడుకులకు సీఎం కేసీఆర్(CM KCR) వెళ్లలేదు. ఈ సంఘటనలు చూస్తుంటే రాజ్‌భవన్, ప్రగతి భవన్(Pragati Bhavan) మధ్య దూరం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్ సీరియస్ కామెంట్స్
దీనికి తోడు ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) చేసిన కామెంట్స్ కూడా చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి. గవర్నర్ హోదాలో పరిమితులు తనకు తెలుసన్న ఆమె...తనను ఎవరూ నియంత్రించలేరంటూ కామెంట్ చేశారు. తాను చాలా శక్తిమంతురాలినని, ఎవరి ముందూ తలవంచేది లేదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలను ప్రేమిస్తానని... ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు.
మే నుంచి ప్రజాదర్బార్
ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందన్న తమిళిసై... ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేశామని ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్బారు నడుస్తుందని చెప్పారామె. అందులో వచ్చిన ప్రజాసమస్యలు ప్రభుత్వానికి నివేదించడం తప్పుకాదన్నారు.
వేడుకల్లో ప్రముఖులు
శుక్రవారం రాజ్‌భవన్‌లో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో హరియాణా గవర్నర్ దత్తత్రేయ, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు,, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, హైకోర్టు జడ్జీలు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటోల్లో కూడా ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే కనిపించాయి.
కన్నెత్తి చూడని అధికార పార్టీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకులకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా రాజ్‌భవన్‌వైపు కన్నెత్తి చూడలేదు. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు.
కౌశిక్ రెడ్డి ఇష్యూతో విభేదాలు
బీజేపీ అజెండాను అమలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై విమర్శలు చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో ప్రారంభమైన విభేదాలు తర్వాత వివిధ అంశాల వల్ల పెరిగి పెద్దవయ్యాయని టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు.
గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ విమర్శలు
గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాజ్ భవన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన తరచూ రాజ్‌భవన్‌్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత కూడా రాజ్ భవన్‌తో ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాలతో బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన తర్వాత గవర్నర్ విషయంలో కేసీఆర్ కఠినంగా ఉంటున్నారు. గవర్నర్ వ్యవస్థపైనా విమర్శలు చేస్తున్నారు.
ఆహ్వానించడం లేదు.. ఆహ్వానించినా రావడం లేదు
వేడుకల ముగింపు సందర్భంగా గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినా వారు రాలేదని అన్నారు. వచ్చిన వారిని గౌరవిస్తానని, రాని వారి గురించి పట్టించుకోనంటూ కామెంట్ చేశారు. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లేదాన్ని అని అన్నారు. తాను చాలా సార్లు ఆహ్వానించినా సీఎం, మంత్రులు రావడం లేదన్నారు. యాదాద్రికి తనను ఆహ్వానించలేదన్నారు. మేడారానికి ఆహ్వానించకపోయినా వెళ్లానన్నారు. ప్రభుత్వపరంగా కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నట్టు తెలిపారు.