Sri Lanka Economic Crisis: శ్రీలంకలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు గొటబాయ, ప్రధానమంత్రి మహింద వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి. దీంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్లు సిద్ధమవుతున్నారు.


ఇదే ప్లాన్?


ఈ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి మహింద రాజపక్సను తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.


సంక్షోభ పరిస్థితులపై అధ్యక్షుడు గొటబాయతో చర్చించిన అనంతరం సిరిసేన ఈ విషయాలు వెల్లడించారు. అధికార కూటమి నుంచి ఇటీవల వైదొలిగిన 40 మందికిపైగా సభ్యుల్లో మైత్రిపాల సిరిసేన ఒకరు. అయితే, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధానమంత్రి మహింద చెప్పిన రెండు రోజుల్లోనే ఆయనను మార్చేందుకు అధ్యక్షుడు సిద్ధమయ్యారు.


మధ్యంతర ప్రభుత్వం


11 పార్టీలతో కొత్త అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు నిర్ణయించారు. కొత్త ప్రధానిని కూడా అఖిలపక్షం ఎన్నుకుంటుంది. తన సోదరుడు మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కూడా గొటబాయే రాజపక్స సమ్మతించారు. శ్రీలంక ఫ్రీడం పార్టీకి చెందిన మైత్రిపాల సిరిసేన శ్రీలంక ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. అతి త్వరలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. ప్రధానమంత్రి మహింద రాజపక్సతో సహా రాజపక్స, అతని కుటుంబం గత 20 ఏళ్లలో శ్రీలంకలో దాదాపు ప్రతి అంశంలోనూ ఆధిపత్యం చెలాయించారు.


గొటబాయేతో భేటీ అనంతరం పార్లమెంట్‌లోని అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రధానిని జాతీయ కౌన్సిల్‌ను నియమించనున్నామని చట్టసభ సభ్యుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు ఎటువంటి ప్రకటన చేయలేదని, అలాంటి చర్య తీసుకుంటే నిర్ణయం తెలియజేస్తామని మహీందా రాజపక్స అధికార ప్రతినిధి రోహన్ వెలివిటా చెప్పారు.


ఇవే కారణాలు


శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు చాలానే కారణాలున్నాయి. ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం వస్తుంది. కొవిడ్‌ కారణంగా పర్యటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అందులో పది శాతం కూడా రావడం లేదు. ఇలా వచ్చే ఆదాయం మొత్తం విదేశీ మారకద్రవ్యమే. 


దిగుమతుల మీదే!


శ్రీలంక అత్యధికంగా దిగుమతుల మీదే ఆధారపడుతుంది. తక్కువ ఆదాయం, అధిక దిగుమతి బిల్లుల కారణంగా పర్యటక ఆధారిత శ్రీలంక విదేశీ మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్ డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్ డాలర్ల లోటులో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది.


Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!


Also Read: Also Read: Elon Musk Buys Twitter: ఎలాన్ మస్క్ ఓ వింత మనిషి- అంతేనా కాదు అంతకుమించి!