కనివినీ ఎరుగుని సంక్షోభం...ఇప్పుడు సింహళ ద్వీపాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. చంటిపిల్లలకు పాలు లేవు. గడచిన వారం రోజులగా కరెంటు లేదు. ఆకలి తీర్చుకోవాలంటే నీ దగ్గర వేల రూపాయలు ఉండాల్సిందే. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల దగ్గర కిలో మీటర్ల లైన్లు.... ప్రపంచమానవాళిని ఉలిక్కిపాటుకు గురిచేసేలా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాలకుల ఘోరతప్పిదాలకు ఇప్పుడు అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
గో…గో గొటబయా...ఇప్పుడు శ్రీలంకలో వినిపిస్తోన్న నినాదం ఇదే. అసలేంటీ ఆర్థిక సంక్షోభం. శ్రీలంక కు పట్టిన ఈ గతి వెనుక కారకులెవరు. ఎందుకింత ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చూద్దాం.
1. కొవిడ్ 19
ప్రపంచంలోని చాలా దేశాల్లానే కొవిడ్ వైరస్ నుంచి ప్రజలను రక్షించుకునేందుకు శ్రీలంక 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టింది. దేశం మొత్తం దీవి కావటంతో ఏవియేషన్, నౌకాయానాలపై పూర్తి నిషేధం పెట్టింది. నెలల గడుస్తున్నా వైరస్ తీవ్రత తగ్గకపోవటంతో మెల్లమెల్లగా దేశం పరిస్థితులు క్షీణించటం మొదలు పెట్టాయి.
ఎందుకంటే శ్రీలంక ప్రధాన ఆదాయ వనరులు ఒకటి టూరిజం, రెండు టీ తోటలు, మూడు వస్త్రపరిశ్రమలు అంటే టెక్స్ టైల్స్. లాక్ డౌన్ కారణంగా ఇవన్నీ నిలిచిపోవటంతో వేరే స్థిరమైన ఆదాయం లేక ప్రభుత్వానికి చాలా కష్టమైంది. మెల్లగా శ్రీలంక సెంట్రల్ బ్యాంకులో ఉన్న విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. డాలర్‌తో పోలిస్తే శ్రీలకం కరెన్సీ కూడా భారీగా పడిపోయింది.
పెట్రోల్, డీజిల్ కోసం శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడే దేశం. లాక్ డౌన్ కారణంగా నిల్వలన్నీ నిండుకోవటంతో దేశంలో ఇంధనం ధరలు పెరిగాయి. వంట గ్యాస్ కొరతతో దేశంలో 90 శాతం వరకూ హోటళ్లు మూసేశారు. రాజధాని కొలంబోతో పాటు దంబుల్లా, కాండీ, గాలే, జాఫ్నా ఇలా ఏ నగరం తీసుకున్నా పరిస్థితులు ఇలానే కనిపిస్తున్నాయి.
ఫలితంగా నిత్యావసరాల ధరలు, పండ్లు, కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి. 60 రూపాయలు పెడితే గాని ఒక్క నిమ్మకాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది. 4 నెలల క్రితం యాపిల్ కిలో రూ. 500.. ఇప్పుడు కిలో రూ. 1000కి చేరింది. పదిహేను రోజుల క్రితమే కిలో చికెన్ వెయ్యిరూపాయలకు చేరుకుంది.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేక శ్రీలంక సెంట్రల్ బ్యాంకు దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు గత రెండేళ్లలో 70% క్షీణించాయి. ఈ ఫిబ్రవరిలో కేవలం 2.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ మారకనిల్వలను లేకపోవడంతో ఇన్ ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ శ్రీలంకలో 300 రూపాయలుగా ఉంది. ఇక భారత్ ఒక రూపాయి విలువ.. శ్రీలంకలో 4 రూపాయలుగా ఉంది. శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇప్పుడే ఇంతటి.. అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
2. చైనా
ఒకప్పుడు డచ్, బ్రిటీష్ పాలనలో ఉన్న సిలోన్‌లో ప్రపంచంలో కొత్త వలసవాద శక్తిగా అవతరించిన చైనా 750 ఎకరాల భారీ ఇసుక క్షేత్రాన్ని స్వాధీనం చేసుకొంది. ఇక్కడ అంతర్జాతీయ నౌకాశ్రయ నగరాన్ని నిర్మించాలని భావిస్తోంది. ప్రపంచ స్థాయి స్వేచ్ఛా వాణిజ్య మండలిగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. సింగపూర్, దుబాయ్‌లకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉన్నత ఉపాధి, ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో శ్రీలంక... చైనా విదేశీ పెట్టుబడులకు లొంగిపోయింది. ఈ విధంగా శ్రీలంక డ్రాగన్ కంట్రీ చైనాపై ఆధారపడింది. 2022లో శ్రీలంకపై దాదాపు 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఉంది. ఇప్పుడు చైనా అందించిన రుణం కూడా దానికి జత చేరింది. నిజానికి.. చైనా ఇచ్చే రుణం మౌలిక సదుపాయాల నుండి మైనింగ్ వరకు అన్ని రంగాలలో పెట్టుబడి రూపంలో అందించారు. ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల వరకూ చైనా శ్రీలంక మీద ఇన్వెస్ట్ చేసిందని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఈ రుణాన్ని సకాలంలో చెల్లించని పక్షంలో శ్రీలంక.. చైనా ముందు మోకరిల్లక తప్పదని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్థాన్, నేపాల్ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణలుగా గుర్తించవచ్చు. అదేవిధంగా శ్రీలంకలోని పలు ప్రాజెక్టులను చైనా ఆక్రమించుకుంది. శ్రీలంక అప్పుల్లో కూరుకుపోయినందున చాలా ప్రాజెక్టులు లీజుకు వెళ్లాయి. దీంతో శ్రీలంక క్రమంగా ఆర్థికంగా పతనానికి చేరుకుంది
గేట్‌వే నివేదిక ప్రకారం, 2005-2015 మధ్యకాలంలో శ్రీలంకలో అధికారిక అభివృద్ధి సహాయం (ఓడీఏ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎప్డీఐ) ప్రధాన వనరుగా చైనా ఉద్భవించింది. ఇందులో చాలా వరకు రుణాలు ఓడీఏ రూపంలో ఉన్నాయి. శ్రీలంకలో చైనా అనేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి, అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి సారించారు. ఈ విధంగా శ్రీలంకలో చైనా తన అడుగులు వేస్తూ వచ్చిది. 2005 సంవత్సరంలో శ్రీలంకలో చైనా ఎఫ్‌డిఐ $16.4 మిలియన్లు. అంటే ఈ మొత్తం శ్రీలంక ఎఫ్‌డిఐలో 1% కంటే తక్కువగా ఉంది. 2015 సంవత్సరం నాటికి, చైనీస్ ప్రైవేట్ పెట్టుబడి $338 మిలియన్లకు చేరుకుంది. ఇది శ్రీలంక మొత్తం ఎఫ్డీఐలో 35%గా ఉంది.
అయితే చైనా కేవలం ఒక్క కారణమే కానీ చైనానే శ్రీలంక సంక్షోభానికి కారణం కాదు
సిలోన్ 1948వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కొత్తగా స్వాతంత్య్రం పొందిన ఈ చిన్న దేశం 1972లో రిపబ్లిక్ దేశంగా మారేంత వరకు బ్రిటిష్ కామన్వెల్త్ నియంత్రణలోనే పాలన కొనసాగించింది. బ్రిటీష్ నుంచి సిలోన్ స్వాత్రంత్య్రం పొందిన తర్వాత.. ఇక్కడ చాలా వరకు వాణిజ్యం బ్రిటిష్, ఇతర యూరోపియన్ వ్యాపార సంస్థల నియంత్రణలోనే ఉంది. దాదాపు 40,000ల మంది కంటే ఎక్కువ మంది యూరోపియన్లు వ్యాపారం చేస్తూ ద్వీపంలోనే నివసించేవారు. వైట్ బ్యూరోక్రాట్లు, పోలీసు, సైనిక అధికారులు కూడా విధుల్లో కొనసాగారు. ఆ పరిస్థితుల్లో సిలోన్ రూపాయి బలంగా ఉంది, చాలా దేశాల్లోనూ ఆమోదం పొందింది.
అనంతరం అప్పటి ప్రధాన మంత్రి సిరిమావో బండారునాయకే తీసుకొచ్చిన సింహళ ఓన్లీ పాలసీతో(Simhala Only Policy) అన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కటిగా తరలిపోయాయి. సోషలిజం వైపు బండారునాయకే మొగ్గుచూపడంతో ప్రైవేటు సంస్థలు నిష్క్రమించాయి. 1970ల నాటి JVP తిరుగుబాటు కూడా కష్టాలకు తోడైంది. JR జయవర్ధనే నేతృత్వంలోని UNP ప్రభుత్వం 1977లో బండారునాయకే సోషలిజాన్ని వ్యతిరేకించింది. 1977లో ఓపెన్ మార్కెట్ ఎకానమీని స్వీకరించింది.
దక్షిణాసియాలో ఆర్థిక సరళీకరణను స్వీకరించిన మొదటి దేశంగా శ్రీలంక అవతరించింది. కానీ 25 ఏళ్లుగా సాగిన తమిళ ఈలం అంతర్యుద్ధం విదేశీ పెట్టుబడిదారులను అడ్డుకుంది. తిరుగుబాటుదారులతో పోరాడడంలో నిమగ్నమై ఉన్న శ్రీలంక ప్రభుత్వం కూడా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టలేదు. శ్రీలంక టీ, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, కొబ్బరి, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, వస్త్రాలను ఎగుమతి చేస్తుంది. దాని ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకొంటుంది. విదేశాల్లో పనిచేస్తున్న శ్రీలంక వాసులు ఏటా 3 నుంచి 4 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపుతున్నారు. పర్యాటకంపై ఆధారపడి 3 మిలియన్లకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సంవత్సరానికి 4 నుంచి 5 బిలియన్ డాలర్ల ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది.
దేశంలో ఉత్పత్తి, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2009 తర్వాత కొద్దికాలం శ్రీలంక భారీ ఆర్థిక వృద్ధిని సాధించింది. విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆశలను పెంచింది. కానీ బిలియన్ల డాలర్ల విలువైన సావరిన్ బాండ్ల జారీలో నిర్లక్ష్యం, రుణాలు, వృథా ఖర్చులతో 10 సంవత్సరాలలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి భారీ రుణాలు తీసుకోవడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. 2009- 12 సమయంలో శ్రీలంక IMF ఆర్థిక పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైంది. 2019లో ఈస్టర్ రోజున బాంబు పేలుళ్లు, రెండు సంవత్సరాల కరోనా పరిస్థితులు శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. దివాలా ముంగిట నిలిచిన దేశం, ప్రజల ఆకలి చావుల నేపథ్యంలో పాలనలోని రాజపక్స కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
3. పొలిటికల్ స్వార్థం
2 కోట్ల 20 లక్షల జనాభా ఉన్న శ్రీలంకకు 2019లో అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సే ఎన్నికయ్యారు. రాగానే తన తమ్ముడు మహేంద్ర రాజపక్సేను ప్రధాని చేశారు. మరో తమ్ముడు బసిల్ రాజపక్సే కోసం ఏకంగా రాజ్యాంగ సవరణ చేసి ఆర్థికమంత్రిగా నియమించారు. బసిల్ రాజపక్సేకు అమెరికా సిటిజన్ షిప్ ఉన్నా పదవి చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేశారు. మూడో సోదరుడు చమల్ రాజపక్సేకు మంత్రి పదవి, చమల్ కుమారుడికీ క్యాబినెట్ ర్యాంక్‌కు సమానమైన హోదా, మహేంద్ర రాజపక్సే కుమారుడికి మంత్రి పదవి ఇలా అడ్డూ అదుపు లేదు.
సమస్యవస్తే మన తిరుపతికి, సింహాచలంకు వచ్చి పూజలు చేసుకుని వెళ్లటం రాజపక్సే కుటుంబానికి సెంటిమెంట్. అందుకే క్రైసిస్ రాగానే పదివేల మంది రాజపక్సే అధికార నివాసం ముందు నిలబడి అంతలా ఆందోళన చేసింది. శ్రీలంక బడ్జెట్ లో దాదాపు 75 శాతం రాజపక్సేల చేతుల్లో ఉంది. ఆందోళనలు ఎక్కువ అవటంతో బసిల్ రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఏరి కోరి తెచ్చుకున్న ఆర్థికమంత్రి కేవలం 24 గంటల్లో పారిపోయాడు. శ్రీలంకలో ఉన్న కల్లోల పరిస్థితి అలాంటిది మరి.
2007 నుంచి శ్రీలంక ప్రభుత్వాలు IMF నుంచి ప్రపంచవ్యాప్తంగా చెల్లేలా ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్స్ తెచ్చుకుంటున్నాయి. అలా ఇప్పటివరకూ 11.8 బిలియన్ డాలర్ల అప్పు తెచ్చుకున్నాయి. వాటిలో చాలా బాండ్లు ఈ నెల ఆఖరుకు పూర్తయిపోతాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంక ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చి కడుతుంది అనేది అనుమానమే.
వాస్తవానికి శ్రీలంకలానే వెనెజులా పరిస్థితి కూడా ఉంది. 2019 మార్చి యూఎన్ రిపోర్ట్ ప్రకారం వెనెజులాలో 94 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. 2021 నాటికి 54 లక్షల మంది దేశం విడిచి శరణార్థులుగా వెళ్లిపోయారు. దేశంలో నివసిస్తున్న 25 శాతం మంది ఓపూట తినాలంటే వేరేవాళ్ల సాయం కోసం నేటికీ ఎదురుచూస్తున్నారు. 2018లోనే ప్రపంచంలోనే హత్యల్లో వెనెజులా మొదటిస్థానంలో నిలిచింది. ఏడాదికి లక్షమంది హత్యకు గురవుతున్నారు అక్కడ. వినటానికే ఇంత భయానకంగా ఉంది కదా. కానీ 1950-1980ల వరకూ వెనెజులాకి స్వర్ణయుగం. వజ్రాలు వీధుల్లో పోసి విదేశీయులకు అమ్మేవాళ్లంటే మీరు నమ్ముతారా? ఆ తర్వాతే అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలు..నాయకుల నిర్లక్ష్య ధోరణి వల్లే వెనిజులా ఇప్పుడిలా తయారైంది. ఇప్పుడు శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది.
శ్రీలంకకు సాయం
సరే ఓ నైబరింగ్ కంట్రీగా మనమేం చేయలేదా శ్రీలం కోసం అంటే చేశాం. విద్యుత్ కోతల సంక్షోభాన్ని తగ్గించడానికి భారతదేశం కూడా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు పంపింది. ఇవి కాకుండా భారతదేశం త్వరలో 40,000 టన్నుల బియ్యాన్ని కూడా పంపుతోంది. భారతదేశపు ట్రాన్స్-షిప్‌మెంట్‌లో 60 శాతం కొలంబో నౌకాశ్రయం ద్వారా జరుగుతోంది. శ్రీలంక అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటి. లంక నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు భారతదేశానికి వస్తుంటారు. భారతదేశం లంకకు ఏటా 5 బిలియన్ డాలర్ల అంటే దాదాపు 38వేల కోట్ల రూపాయల ఎక్స్ పోర్ట్ చేస్తోంది. ఇది మొత్తం దేశపు ఎగుమతుల్లో 1.3 శాతం.
దేశంలో పర్యాటకం, రియల్ ఎస్టేట్, తయారీ, కమ్యూనికేషన్, పెట్రోలియం రిటైల్ మొదలైన రంగాలలో కూడా భారతదేశం పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అతిపెద్ద వనరులలో భారతదేశం ఒకటి. ఇండియాకు చెందిన కొన్ని పెద్ద కంపెనీలు కూడా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాయి.
ఇటీవలి సంవత్సరాలలో శ్రీలంక, చైనా మధ్య సహకారం పెరిగింది. చైనా శ్రీలంకలో అనేక పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడులుపెట్టింది. అయితే తాజాగా శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంలో చైనా సాయం కనిపించడం లేదు.
ఏం నేర్చుకోవాలి?
ఓట్ల కోసం రాజకీయ హామీలు గుప్పించకూడదు. ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే మిగిలేది చిప్పే. శ్రీలంక ప్రపంచ రుణ సంస్థల నుంచే కాకుండా 6 శాతం వడ్డీతో మిగిలిన సంస్థలు నుంచి కూడా రుణాలు తీసుకుంది. అక్కడ ప్రజల ఆదాయం రూ.100 ఉంటే అప్పు రూ.250 ఉంది.
ఇంకా లోకల్ గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత పథకాలు, చాలా పథకాలు రాష్ట్రంలో ఉన్న జనాభాకు సమానంగా లబ్దిదారులను చూపిస్తుంటే ఎవరికి మంచి జరుగుతున్నట్లు డబ్బు ఎక్కడికి పోతున్నట్లు. లీకేజీలను అరికట్టి ప్రతీ రూపాయి సేవ్ చేసుకున్నప్పుడు..మన దగ్గర ఇన్వెస్ట్ మెంట్‌లు పెట్టించుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కొంచెం అటు ఇటైనా కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. లేదంటే శ్రీలంక పరిస్థితి అన్ని చోట్ల రిపీట్ అవుతుంది.
Also Read: Zombie Disease In Canada: వైరస్‌ల కాలం! ఏది పడితే అది తినకండి సామీ! జాంబీ వైరస్ బయల్దేరింది!