ప్రపంచంపై వైరస్‌లు పగ పట్టినట్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి దండయాత్రలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తాజాగా మరో రూపం మార్చుకుని ఒమిక్రాన్ XE వేరియంట్‌గా వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ గురించి ప్రజలు భయపడుతుంటే తాజాగా మరో వైరస్ బయల్దేరింది. అదే జాంబీ వైరస్. అసలేంటి ఈ వైరస్?
ఏం జరుగుతోంది?
కెనడాలో ప్రాణాంతక డేంజరస్ వైరస్ బెంబేలెత్తిస్తోంది. అదే జాంబీ వైరస్. కెనడాలోని జింకల్లో ఈ జాంబి వైరస్ బయటపడింది. జాంబీ సినిమాల్లో చూపించినట్లే ఇక్కడ జరుగుతోంది. జాంబీ సోకిన మనిషి కరిచిన వాళ్లు కూడా జాంబీగా మారతారు. అలాగే ఇప్పుడు కెనడాలో జాంబీ సోకిన జింకలు..ఇతర జింకలను చంపి తింటున్నాయి. జింకల్లో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
25 ఏళ్ల తర్వాత
1996లోనే పశువుల్లో ఈ జాంబీ వైరస్‌ను గుర్తించారు. వాటి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. అప్పట్లో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేశారు. మళ్లీ దాదాపు 25 ఏళ్ల తర్వాత జింకల్లో జాంబీ వైరస్ బయటపడటం టెన్షన్ పెడుతోంది.
మనుషులకు వస్తుందా?
ఈ వైరస్ జింకల నుంచి ఇతర జంతువులు, మనుషులకు కూడా వ్యాపించే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువు మాంసం తిన్నా, దాని మలమూత్రాలు, లాలాజలం ముట్టుకున్నా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వేటగాళ్లు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉందంటున్నారు.
అయితే ఇప్పటివరకు మనుషుల్లో ఒక్క జాంబీ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పిటకీ జాగ్రత్తగా ఉండటం మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.