చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. తూర్పు లద్దాఖ్‌పై చర్చలు కొనసాగిస్తూనే భారత ప్రభుత్వ రంగ సంస్థలపై హ్యాకింగ్ చేస్తోంది. భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్లు దాడి చేసినట్లు నిఘా సమాచారం. ఇందులోకి చొరబడి కీలక సమాచారాన్ని దొంగలించినట్లు తెలుస్తోంది. గతంలో 'రెడ్‌ఎకో' గ్రూప్‌ వీటిని హ్యాక్‌ చేసింది. తాజాగా డబ్బెడ్‌ టాగ్‌ 32 అనే గ్రూపు ఈ సైబర్ దాడికి పాల్పడ్డట్లు అధికార వర్గాల సమాచారం.







ఏం జరిగింది?


చైనాకు చెందిన డబ్బెడ్ టాగ్-32 హ్యాకర్లు ఉత్తర భారత్‌లోని విద్యుత్తు సరఫరాకు చెందిన 7 లోడ్ డిస్పాచ్ సెంటర్లను హ్యాక్ చేశారు. ఇవి చైనా సరిహద్దుల్లో ఉండే లద్దాఖ్ ప్రాంతంలోని పవర్ గ్రిడ్ నియంత్రణకు, విద్యుత్ సరఫరాకు అత్యంత కీలకం.


డబ్బెడ్ టాగ్-32 గ్రూప్ హ్యాకింగ్ కోసం షోడో పాడ్ అనే ఓ అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను వాడినట్లు తెలిసింది. ఈ హ్యాకింగ్ గ్రూపు గతంలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పనిచేసిందని రికార్డెడ్ ప్యూచర్ సంస్థ తెలిపింది.


గతంలో


ఇంతకుముందు భారత నౌకాశ్రయాలు, విమానయాన సంస్థలే లక్ష్యంగా కూడా చైనా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 2021లో భారత్‌లో ఓ నౌకాశ్రయాన్ని చైనా ప్రభుత్వం అధీనంలో పనిచేసే 'రెడ్‌ ఎకో' గ్రూప్‌ హ్యాక్‌ చేసింది. ఈ గ్రూప్‌ ఇంకా చురుగ్గా వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ సంస్థ గుర్తించింది. రెండు నౌకాశ్రయాలు సహా, పది సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు గతేడాది ఫిబ్రవరి 10న గుర్తించామని చెప్పింది. ఫిబ్రవరి 28 నాటికి కూడా కొన్ని సంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని వెల్లడించింది.


ఇదే ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించింది. ఇది 2020 సెప్టెంబర్‌ నుంచి ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉంది. ఎయిర్‌ ఇండియాపై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ వినియోగించినట్లు గ్రూప్‌ ఐబీ పేర్కొంది. హ్యాకింగ్‌ కోసం ఎస్‌ఎస్‌ఎల్‌ సర్టిఫికెట్‌ను వినియోగించుకొన్నట్లు వెల్లడించింది. వీరు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తే ఏపీటీ41 పనిగా అర్థమైంది.