Coronavirus In Shanghai: బాబు చిట్టి! లిప్‌లాక్‌లు, హగ్‌లు వద్దు, కలిసి పడుకోవద్దు- అక్కడ వింత ఆంక్షలు!

ABP Desam Updated at: 07 Apr 2022 01:55 PM (IST)
Edited By: Murali Krishna

చైనాలో కరోనాను నియంత్రించేందుకు కఠిన ఆంక్షలు విధిస్తోంది ప్రభుత్వం. తాజాగా భార్యభర్తలు కలిసి నిద్రించవద్దని వింత ఆంక్షలు విధించింది.

బాబు చిట్టి! లిప్‌లాక్‌లు, హగ్‌లు వద్దు, కలిసి పడుకోవద్దు- అక్కడ వింత ఆంక్షలు!

NEXT PREV

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు చైనా వింత ఆంక్షలు పెడుతోంది. ఇప్పటికే ఆర్థిక రాజధాని షాంఘైలో కఠిన లాక్‌డౌన్ విధిస్తున్న చైనా ఇప్పుడు ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా భార్యభర్తలు కలిసి నిద్రపోకూడదని, ముద్దులు, కౌగిలింతలు వద్దని హెచ్చరికలు చేసింది.



కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవద్దు... కరోనా చాలా తీవ్రంగా ఉంది. ఈ ఆంక్షలు పాటించాలని పౌరులను కోరుతున్నాం. కొవిడ్ ప్రబలకుండా పరిమితులు పాటించాలని కోరుతూ డ్రోన్లు తిరుగుతున్నాయి. ఇంటి కిటికీలను కూడా తెరవవద్దు. ఈ రాత్రి నుంచి జంటలు విడివిడిగా పడుకోవాలి, ముద్దు పెట్టుకోవద్దు, కౌగిలింతలు అనుమతించం, విడిగా తినాలి.                                                                          - షాంఘై అధికార యంత్రాంగం 


నగరం ఖాళీ


ఈ ఆంక్షలతో సందడిగా ఉండే షాంఘై నగర వీధులు లాక్ డౌన్ ఆంక్షలతో ఖాళీగా కనిపిస్తున్నాయి. షాంఘై వీధుల్లో కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం షాంఘై వాసులు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు. చైనా దేశంలోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది. దీంతో నగరంలోని 2.6 కోట్ల మంది ఇళ్లకే పరిమితం అయ్యారు.


వీలైనన్నీ ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. నగరంలో ఉన్న మొత్తం 2.6 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది కరోనా వైరస్‌ను మిస్ కాకుండా గుర్తించగలదు. స్వల్పంగా కరోనా ఉన్నా ఈ పరీక్షలో తెలిసిపోతుంది.


సైన్యం


షాంఘైలో కరోనా పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఏకంగా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది ప్రభుత్వం. 2 వేల మందికి పైగా సైనికులు షాంఘై నగరంలో ఉన్నారు. షాంఘై నగర విమానాశ్రయాల్లో సైనిక విమానాలు ల్యాండ్ అవుతూనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.


మార్చి 28, 29 నుంచి ఇక్కడికి సైన్యం వస్తున్నట్లు వారు తెలిపారు. నిరంతరం విమానాల రాకపోకలతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో ఉండేవారికి నిద్ర కూడా లేకుండా పోయిందని తెలిపారు.


కఠిన లాక్‌డౌన్‌ అమలు అవుతోన్న వేళ ప్రజలు నిరసనలకు దిగితే అదుపులో ఉంచేందుకు పోలీసులు కూడా నిరంతరం పహారా కాస్తున్నారు. భారీ ఆయుధాలను చేతబట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.



Also Read: Intelligence Report: భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి- ఇవేం పనులురా నాయనా? 





Published at: 07 Apr 2022 01:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.