Bangladesh Violence: బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధి, చిట్టగాంగ్‌లోని ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్ అరెస్టు సంచలనం రేపుతోంది. సోమవారం (నవంబర్ 25) బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో చిన్మోయ్ కృష్ణ బ్రహ్మచారిని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సాయంత్రం 4:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా చిన్మోయ్ కృష్ణ బ్రహ్మచారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కేసు నమోదు అయిన పోలీసు స్టేషన్‌కు అప్పగిస్తారు అని పోలీసు అధికారి వెల్లడించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏంటనేది మాత్రం సమాచారం ఇవ్వలేదు.
అక్టోబర్ 30న నమోదు అయిన కేసులో భాగంగానే చిన్మోయ్‌ను అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు మరో 18 మందిపై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం అక్టోబర్ 25న చటోగ్రామ్ న్యూ మార్కెట్ కూడలి వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)కి సంబంధించిన కాషాయ జెండా ఎగురవేశారని ఆరోపణ. దీనిపై ఎండీ ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు రాజద్రోహ చట్టాల కింద కేసు నమోదు చేశారని సమాచారం.
చిన్మోయ్ అరెస్టు తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారింది. అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం ప్రజలు వీధుల్లోకి వచ్చింది. అదే టైంలో బీఎన్‌పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. వీటన్నింటికీ నిరసనగా సోమవారం రాత్రి వేలాది మంది హిందువులు మౌల్వీ బజార్‌లో జై సియా రామ్, హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు.
Also Read: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
షాబాగ్‌లో జరిగిన సమావేశంలో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్‌పై కూడా కొందరు దుండగులు దాడి చేశారు. గాయపడిన ఆయన్ని ఆస్పత్రిలో చేరారు. ఇంతలా గొడవలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. షాబాగ్ దాడి సమయంలో పక్కనే ఉన్న పోలీసులు, అధికారులు చూస్తూ ఉండిపోయేరే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఏ స్థాయిలో దాడి జరిగిందో సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు తెలియజేస్తున్నాయి.
ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ
ఈ దాడులను బీజేపీ ఖండించింది. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో ఉంటున్న హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని ఎక్స్ లో రాశారు. చిన్మోయ్ అరెస్టుతో బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఛాందసవాద సమూహాల హింసాత్మక వైఖరి, ప్రభుత్వ మౌనం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల హక్కులు రక్షించి వారికి భద్రత ఇవ్వాలని భారత్‌సహా అనేక అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ దాడులు, అరెస్టుల ఖండిస్తున్నారు. తక్షణమే పరిష్కారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !