Elon Musk Praises Indian Election System | వాషింగ్టన్: ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ తనకు తోచిన విషయాన్ని నిర్మొహమాటంగా బయటకు వెల్లడించే తరహా వ్యక్తి. ఈ క్రమంలో అమెరికా ఎన్నికలతో పోల్చి, భారత ఎన్నికల ప్రక్రియపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లులు కురిపించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వారాలు గడుస్తున్నా కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు.
భారత్ లో కొన్ని నెలల కిందట సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒక్కరోజులోను ముగిస్తుంది భారత ఎన్నికల సంఘం. ఈ విషయంపై భారత్‌లో 640 మిలియన్ల ఓట్లను ఒక్కరోజులోనే ఎలా లెక్కించారు?’ అనే హెడ్‌లైన్‌తో పబ్లిష్ అయిన వార్తను వి ద పీపుల్ పాపులిజం ఇన్ డెమోక్రసీ అనే పేజీలో పోస్ట్ చేశారు. చీటింగ్ అనేది వారి లక్ష్యం కానప్పుడు ఎన్నికల ప్రక్రియ ఇలా ఉంటుంది అనే ఆ పోస్ట్ సారాంశం. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్ ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను లెక్కించారు. కానీ, కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు అని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. చేతితో తల పట్టుకున్నట్లు ఎమోజీ కూడా పోస్ట్ చేయడంతో మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది.
భారత్‌లో ఈవీఎంలు ఉపయోగిస్తున్న ఈసీ
భారతదేశంలో ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా తక్కువ సమయంలోనే కోట్లాది ఓట్ల లెక్కింపు పూర్తి చేసి గంటల్లోనే ఎన్నికల ఫలితాలు ఈసీ వెల్లడిస్తోంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని తెలిసిందే. కానీ అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి రికార్డులు తిరగరాశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి, మాజీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికల బరిలోకి దిగి నెగ్గడం దాదాపు 126 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇది తొలిసారి. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఈ ఎన్నికల్లో ఓటమి చెందగా, వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తేలి ఇన్ని రోజులు గడిచినా కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు.
కాలిఫోర్నియా - అమెరికాలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. అక్కడ పోలైన ఓట్లు ఎక్కువగా మెయిల్ ద్వారా వచ్చాయి. దాంతో వాటిని లెక్కించేందుకు భారీగా సమయం పడుతోందని, ఇప్పటివరకూ 98 శాతం ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. 650 మిలియన్ల ఓట్లను భారత్ ఒక్కరోజులోనే లెక్కిస్తే, కాలిఫోర్నియాలో మాత్రం రోజులకు రోజులు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.