Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడికి రష్యా ప్రమాదకరమైన ఆయుధాలు వాడుతోంది. శుక్రవారం తొలిసారి ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన రష్యా.. రెండు రోజుల్లోనే రెండోసారి వీటిని ప్రయోగించింది. ఆదివారం మరోమారు హైపర్ సోనిక్ క్షిపణులను వినియోగించినట్లు తెలిపింది.





ఎక్కడి నుంచి?


బ్లాక్ సీ, కాస్పియన్ సముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ నగరాలపై హైపర్ సోనిక్ క్షిపణులను రష్యా ప్రయోగించింది. రష్యా తొలిసారి కింజాల్ హైపర్ సోనిక్ మిసైళ్లను శుక్రవారం ప్రయోగించింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయుధాలు నిల్వ ఉంచిన ఇవానో-ఫ్రాంకి‌వ్‌స్క్ ప్రాంతంలోని డెలియటిన్ గ్రామంలో అండర్ గ్రౌండ్ వేర్‌హౌస్‌ను ఈ క్షిపణులతో ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.


హైపర్‌సోనిక్‌ అంటే..?


ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. దీన్ని మించిన వేగాన్ని సూపర్‌సోనిక్‌ అంటారు. ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో ప్రయాణించే క్షిపణిని హైపర్‌సోనిక్‌ అస్త్రంగా పేర్కొంటారు. ఇవి గంటకు 6,000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలవు.


అయితే రష్యా ప్రయోగించిన కింజాల్ క్షిపణి ప్రప్రయోగించిన వెంటనే గంటకు ఇది 4,900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అనంతరం గరిష్ఠంగా 12,350 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది. ఇది 480 కిలోల అణు పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. అంటే.. హిరోషిమాపై వేసిన బాంబు కన్నా 33 రెట్లు శక్తిమంతమైన విస్ఫోటాన్ని కలిగించే అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగలదు.


ఎవరి దగ్గరున్నాయి?


అమెరికా, రష్యా, చైనా వద్ద అధునాతన హైపర్‌సోనిక్‌ అస్త్రాలు ఉన్నాయి. భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఉత్తర కొరియా వీటిని అభివృద్ధి చేస్తున్నాయి.



Also Read: Fourth Covid Wave: మామా మనం సేఫ్! ఎన్ని కొవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదట!


Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!