ప్రపంచవ్యాప్తంగా మనిషి అవసరాలను తీర్చే ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. అనేక ల్యాబోరేటరీలలో నిత్యం వందలకొద్దీ పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతవరకు దుస్తులు మన ఒంటికి గాలి, ఎండ, పరిసరాల నుంచి రక్షణను మాత్రమే ఇస్తాయని తెలుసు. కానీ మనుషుల గుండె చప్పుడును కూడా వినగలిగే ఫ్యాబ్రిక్ ఇప్పుడు సిద్ధమైంది. దీన్ని శాస్త్రవేత్తలు తయారుచేశాక, పరీక్షించి చూశారు. ఈ కొత్త ఫ్యాబ్రిక్ మనుషుల హార్ట్ బీట్‌ను పసిగడుతున్నట్టు నిర్ధారించారు. ఈ అద్భుత ఆవిష్కరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికైంది. రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ సంస్థతో కలిసి పరిశోధకులు ఈ క్లాత్‌ను సృష్టించారు. 


ఎలా వింటాయి?
ఈ ఫ్యాబ్రిక్ ఒక మైక్రోఫోన్ లా పనిచేస్తుంది. ధ్వనిని గ్రహించి మెకానికల్ వైబ్రేషన్లుగా మారుస్తుంది. ఆ తరువాత ఆ వైబ్రేషన్లను మన చెవుల్లాగే విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ తయారుచేయడానికి శాస్త్రవేత్తలకు ప్రేరణనిచ్చింది మనుషుల చెవి నిర్మాణం, పనితీరే. అందుకే ఈ ఫ్యాబ్రిక్‌కు వినే సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఫైబర్‌లతో తయారుచేసినట్టు చెప్పారు ప్రధాన పరిశోధకుడు, మెటీరియల్ సైంటిస్టు అయిన యోయెల్ ఫింక్. 


వస్త్రాన్ని తయారుచేసే ఫైబర్లో ‘ఫైజెఎలెక్ట్రిక్’ అనే పదార్థం ఉంటుంది. దీన్ని వంచినప్పుడు విద్యుత్ సిగ్నళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది శబ్ధాల నుంచి విద్యుత్ సంకేతాలను సృష్టించే సామర్థ్యాన్ని ఫ్యాబ్రిక్‌కు అందిస్తుంది. విడికిడి లోపం ఉన్నవారికి కూడా ఫైబర్ వినికిడి యంత్రంగా ఉపయోగపడుతుంది. శబ్ధం వచ్చిన దిశను పసిగట్టేగలిగేంత సున్నితంగా ఉంటాయి.  


హార్ట్ బీట్ ఎలా?
మరొక శాస్త్రవేత్త వీయాన్ మాట్లాడుతూ ‘ఈ ఫ్యాబ్రిక్ మానవ చర్మంతో ఇంటర్‌ఫేస్ చేయగలదు. దీని వల్ల ధరించిన వారి శరీరంలోని శబ్ధాలను ఇది గ్రహిస్తుంది. గుండె, శ్వాసకోశ స్థితిని దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది’ అని చెప్పారు. నిజానికి మన చెవికి వినిపించే శబ్ధాలకు మనం వేసుకున్న దుస్తులు కూడా కంపిస్తాయి. కానీ మనకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే ఆ కంపనాలు నానోమీటర్లలో ఉంటాయి. 


ఈ వస్త్రాన్ని కేవలం మనుషుల హార్ట్ బీట్ పర్యవేక్షించడానికే కాదు, అంతరిక్ష ధూళి శబ్ధాలను వినడానికి స్పేస్ క్రాఫ్ట్ పై పొరలో అమర్చవచ్చు. భవనాలలోపలి పగుళ్లు చేసే చిన్నపాటి శబ్ధాలు దీని ద్వారా విని, ఆ భవనాలు ఎంతకాలం నిలిచి ఉంటాయో కూడా తెలుసుకోవచ్చు. తద్వారా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. 


Also read: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి


Also read: ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే ముందుగా చేయాల్సిన పని ఇదే