Telangana Congress News: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్‌లో (Ashoka Hotel) సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంపై హైకమాండ్ సీరియస్ అయింది. సమావేశం రద్దు చేసుకోవాలని ఆదేశించారు. అయితే, హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీనియర్ లీడర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ (V Hanmath Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను (Telangana Congress) బతికించుకొనేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వీహెచ్ వెల్లడించారు. బెదిరింపులు చేస్తే తాను భయపడబోనని అన్నారు. మీటింగ్ రద్దు చేసుకోవాలని అందరూ కోరుతున్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) తనతో మాట్లాడితే మీటింగ్ రద్దు చేస్తానని, లేదా సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మాట్లాడుతూ.. వీహెచ్ పిలిచినందున ఆ భేటీకి తాను వెళ్తున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. రెండ్రోజుల క్రితమే తనను పిలిచినట్లు చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్దామని వివరించారు. ‘‘మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నా బయటికేమీ చెప్పొద్దని నిర్ణయించుకున్నాం. మీడియాతో ఏ అంతర్గత విషయాలు చెప్పొద్దని అనుకున్నాం. పార్టీలో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించుకొనేందుకు సరైన పద్ధతి పాటించడం లేదు. ఆ విషయంపైనే సీనియర్లు చర్చలు జరుపుతున్నారు.’’
‘‘జగ్గారెడ్డి ఎవ్వరు రమ్మన్నా పోలేడు. ఇది జగమెరిగిన సత్యం. 2018 తర్వాత కూడా గవర్నమెంట్ నాపై ఎంత ఒత్తిడి చేసినా కాంగ్రెస్ నుంచి పోలే. అలాంటి నాపై, 2017లో భారీ బహిరంగ సభ సంగారెడ్డిలో చేసిన నాపైనే ఠాకూర్, రేవంత్ కలిసి మహేశ్ గౌడ్ ద్వారా కేసీ వేణుగోపాల్‌కు తప్పుడు ప్రచారంతో లేఖ రాశారు. నేను టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని కుట్ర చేశారు. ఇదంతా పార్టీ పెంచడానికా, పార్టీని ముంచడానికా? ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరికితే వారిని కలుస్తా. కేసీ వేణుగోపాల్‌ను కూడా కలుస్తా. ఉన్న విషయాలు చెప్పి, మా సిన్సియారిటీ మీద బురద జల్లితే ఊరుకోం. ఈ డ్రామాలు నడవవు.’’ అని జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.