Russia-Ukraine War:
చర్చలకు సిద్ధమే..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia Ukriane Conflict) మొదలై 16 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గడం లేదు. దాడులు, ప్రతి దాడులతో అన్ని ప్రాంతాలు ధ్వంసమైపోయాయి. రెండు వైపులా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. యుద్ధాన్ని ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నించినా అవేమీ ఫలితం చూపించలేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ...స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ రష్యాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం...తమ దేశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నాకే ఈ చర్చలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. అంటే...రష్యా సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగితే కానీ అందుకు ఒప్పుకోనని పరోక్షంగా చెప్పారు. క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సాన్ ప్రాంతాలు ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ అధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే రష్యా సైనిక చర్య మొదలు పెట్టిందో అప్పటి నుంచి అవి రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఇది సాధించిన తరవాతే చర్చలకు వెళ్తామని అంటున్నారు జెలెన్‌స్కీ. ఈ కండీషన్‌కి రష్యా ఒప్పుకుంటుందా లేదా అన్న తేలాల్సి ఉంది.
పుతిన్ మరోలా..
ఉక్రెయిన్‌పై రష్యా న్యూక్లియర్ వార్ ప్రకటించనుందా..? చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తూనే ఉన్నా...రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russia President) ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. బెలారస్‌లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచాం అంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే...రష్యా భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్ వార్‌కి దిగుతామని స్పష్టం చేశారు పుతిన్. అటు అగ్రరాజ్యం మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగిస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని చాలా రోజులుగా వాదిస్తోంది. ఇటు పుతిన్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. అప్పటి నుంచి బెలారస్ రష్యాకు హెల్ప్ చేస్తోంది. చెప్పాలంటే...ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఇది "లాంఛ్‌ప్యాడ్"గా మారింది. పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించే యోచనలో ఉంది రష్యా. "మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో వార్నింగ్" అని పుతిన్ స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది. "మీరు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారా..?" అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పుతిన్.
"ప్రపంచం మొత్తాన్ని భయపెట్టాల్సిన అవసరం మాకేముంది..? ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రష్యా భూభాగంపై దాడి చేయాలని, ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడం"
- పుతిన్, రష్యా అధ్యక్షుడు
Also Read: ఆర్నెల్లలో 2 లక్షల మంది ఉద్యోగాలు ఉఫ్, ప్రపంచవ్యాప్తంగా ఇదే గుబులు