Microsoft Employees:


సత్య నాదెళ్లపై ఫైర్ 


కంపెనీ నష్టాల్లో ఉండి జీతాలు పెంచకపోతే ఓకే. కానీ ప్రాఫిట్స్ వచ్చినా హైక్ ఇవ్వకపోతే...ఎంప్లాయీస్‌ ఊరుకుంటారా..? మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఇప్పుడిదే అసహనంతో ఉన్నారు. గతేడాది కంపెనీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఈవో సత్య నాదెళ్లపైనా మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది మైక్రోసాఫ్ట్. అది చాలదన్నట్టు హైక్‌లు కూడా ఆపేసింది. ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆల్‌టైమ్ రెవెన్యూ సాధించింది. దీన్ని ప్రస్తావిస్తూ సీఈవో సత్య నాదెళ్ల ఇంటర్నల్ మెసెంజర్‌లో అందరికీ మెసేజ్ పంపారు. ఈ రికార్డు సాధించడానికి కారణం ఉద్యోగులే అంటూ పొగిడారు. అందరికీ థాంక్స్ చెప్పారు. వచ్చే ఏడాది కూడా ఇదే జోష్‌తో పని చేయాలని కోరారు. దాదాపు 2 లక్షల మందికి ఈ మెసేజ్ పంపారు. ఈ మెసేజ్‌కి కొంత మంది పాజిటివ్‌గానే రెస్పాండ్ అయినా...చాలా మంది నెగటివ్‌గా స్పందించారు. ఇంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు సరే...ఇంతకీ మాకు హైక్‌లు ఉన్నట్టా లేనట్టా..? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనేజర్‌లపైనా మండి పడ్డారు. శాలరీల విషయంలో మేనేజ్‌మెంట్‌తో మాట్లాడటంలో ఫెయిల్ అయ్యారని, వాళ్ల వల్లే తమకు జీతాలు పెరగలేదని ఫైర్ అవుతున్నారు. రికార్డు స్థాయిలో ప్రాఫిట్స్ వస్తుంటే...జీతాలు పెంచడానికి ప్రాబ్లమ్ ఏంటి..? అని వాదిస్తున్నారు. 


వేరే కంపెనీకి వెళ్లిపోతారట..


మునుపటితో పోల్చుకుంట పని గంటలు పెరుగుతున్నాయని,తమ ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు. కంపెనీ కోసం ఇంత డెడికేటెడ్‌గా పని చేస్తుంటే కనీస గుర్తింపు లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ పని చేస్తున్నానని చెప్పుకోడాని కూడా ఇబ్బందిగా ఉందని కొందరు సంచలన కామెంట్స్ చేశారు. వేరే కంపెనీలో ఇదే CTCతో ఆఫర్ వస్తే వెళ్లిపోతామని డైరెక్ట్‌గానే చెబుతున్నారు. ఈ విమర్శలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) క్రిష్టోఫర్ స్పందించారు. జీతాలు పెంచుకునే చిట్కా కూడా చెప్పారు. ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న ఆయన...అందరి ఎంప్లాయిస్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులందరూ కలిసి కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ పెంచేలా చేయగలిగితే చాలని, ఆటోమెటిక్‌గా జీతాలు పెరుగుతాయని అన్నారు. అయితే...ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ స్టాక్‌ ప్రైస్‌ గతంలో కన్నా పెరిగింది. దాదాపు 33% పెరిగినట్టు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ ఏడాది హైక్‌లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పింది కంపెనీ. బోనస్‌లు, స్టాక్‌ అవార్డులకు సంబంధించిన బడ్జెట్‌లోనూ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. 


"ఉద్యోగులందరూ జీతాలు పెంచడం లేదని అంటున్నారు. కానీ...నా దగ్గర ఓ చిట్కా ఉంది. అది పాటిస్తే మీ అందరి జీతాలు పెరుగుతాయ్. ఏమీ లేదు. మీరు బాగా కష్టపడి మన కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ని పెంచండి చాలు. క్వార్టర్‌లీ రిజల్ట్స్‌ బాగా వస్తే ఆటోమెటిక్‌గా మీ సీటీసీ పెరుగుతుంది. దానిపై దృష్టి పెట్టండి"


- క్రిష్టోఫర్, మైక్రోసాఫ్ట్ సీఎమ్‌వో


Also Read: చాట్ జీపీటీ వాడుతున్నారా? ఉద్యోగం జాగ్రత్త - కంపెనీలు నిఘా పెడుతున్నాయ్