AP BJP New Chief : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులు చేయాలనుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఇలా మార్పులు చేయాలనుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పటికే చర్చనీయాంశమమయింది. ఏపీలో కూడా అధ్యక్షుడి మార్పు అంశం హాట్ టాపిక్ గా మారుతోంది.
సోము వీర్రాజును మార్చాలని నిర్ణయం తీసుకున్నారా ?
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసింది. ఆయననే అధ్యక్షుడిగా కొనసాగిస్తామని పార్టీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ గతంలో ప్రకటించారు. నిన్నామొన్నటిదాకా సోము వీర్రాజును తొలగిస్తారన్న ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. వచ్చె ఎన్నికల్లో పొత్తుల అంశాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాజకీయ సమీకరణఆలు మారాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సారి రాయలసీమ నేతకు చాన్స్ !
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కోస్తా ప్రాంత నేతే కొనసాగుతున్నారు. ఈ సారి రాయలసీమ నేతను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ గా చేస్తే.. బీసీ వర్గాలకు .. అలాగే రాయలసీమకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. సత్యకుమార్ కు బీజేపీ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పులవురు నేతలు
ఏపీ బీజేపీలో వర్గ పోరాటం కూడా ఉంది. సోము వీర్రాజు వ్య వహారశైలిని ఓ వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పుడు కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి వివాదాస్పదమయింది. ఆయనను ఆపేందుకు ప్రయత్నించలేదని.. హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శలు కొంత మంది నేతలు చేశారు. అదే సమయంలో సోముకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నేతలు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు పెట్టవద్దని చెప్పి వారందర్నీ పంపించేసినట్లుగా చెబుతున్నారు. బుధవారం నాటికి ఏపీలో బీజేపీ చీఫ్ ను మారుస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.