China Company Offers: చైనా జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు జనాభా పెరుగుదల సమస్యను ఎదుర్కొంటుంటే.. చైనా లాంటి దేశాలు జనాభా పెరుగుదల లేక సమస్య ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఉన్న జనాభాలో ఎక్కువగా వృద్ధులే ఉండటం, శిశు జననాల రేటు పడిపోవడం, యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలను కనడానికి ఆసక్తి చూపకపోతుండటం.. ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి దేశంగా ఉన్న చైనా.. వృద్ధుల వల్ల ఉత్పాదకత తగ్గి సమస్య ఎదుర్కొంటోంది. అందుకే మొన్నటి వరకు పిల్లలను కనవద్దని, వన్ ఆర్ నన్ (ఒక్కరు లేదా ఒక్కరు కూడా వద్దు) అనే ప్రచారం చేస్తూ వచ్చిన చైనా పాలకులు.. ఇప్పుడు తమ పంథా మార్చుకుని పిల్లలను కనాలని ప్రచారం చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని జనాలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే యువత మాత్రం పెళ్లిళ్లు చేసుకోబోమని, పిల్లలను కనబోమని భీష్మించుకు కూర్చుంది.
జీవన వ్యయం విపరీతంగా పెరగడం వల్ల ఎంతో కష్టపడితే గానీ పొట్టగడవని పరిస్థితిలో ఉన్నారు చైనా పౌరులు. ఇలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం, పిల్లలను కని పెంచడం వల్ల తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని భయపడి వద్దనుకుంటున్నారు. అందుకే చైనా సర్కారు పిల్లలను కనాలని ప్రచారం చేస్తుండటంతో పాటు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చైనా సర్కారుతో పాటు ఆ దేశ కంపెనీలు కూడా భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది.
ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన ట్రిప్.కామ్.. తమ ఉద్యోగులు పిల్లలను కంటే భారీ మొత్తంలో బోనస్ ఇస్తామని ప్రకటించింది. తమ సంస్థలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఉద్యోగులు పిల్లలను కంటే ఒక్కో బిడ్డకు 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 10 వేల యువాన్లు(ఐదేళ్లకు రూ. 5.65 లక్షలు) ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రిప్.కామ్ ప్రకటించింది. ఈ మేరకు ట్రిప్.కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్న్ జేమ్స్ లియాంగ్ వెల్లడించారు. ఇందుకోసం 140 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: Aspartame: WHO చెప్పిన అస్పర్టమే అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ వస్తుందా? ఈ ఉత్పత్తుల్లోనే ఎక్కువ!
జనాభా పడిపోయింది
చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. గత పదేళ్లలో వార్షిక జనాభా వృద్ధి రేటు 0.53%గా నమోదు అయింది. ఇలా జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో ముసలి వారి సంఖ్య పెరుగుతుంది. యువత సంఖ్య తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే అంశం. చైనాలో 16 నుంచి 59 మధ్య వయస్సులోని వారి సంఖ్య నాలుగు కోట్లు తగ్గడం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రస్తుతం పనిచేయగల సత్తా ఉన్న జనాభా 88 కోట్ల దాకా ఉంది. ఒక బిడ్డ విధానానికి స్వస్తి పలికాక జననాల సంఖ్య పెరిగినట్టు గుర్తించారు అధికారులు. 2020లో 12 మిలియన్ల మంది శిశువులు జన్మించగా, 2021 మే చివరి నాటికి 14.65 మిలియన్ల మంది పిల్లలు జన్మించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial