ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని భారతీయ విద్యార్థులు, పౌరులు ఈరోజే విడిచిపెట్టి వెళ్లాలని తెలిపింది.


విద్యార్థులు.. రైళ్లలో వెళ్లడం ఉత్తమమని సూచించింది. రైళ్లు దొరకకపోతే ఇతర వాహనాల ద్వారా వెళ్లాలని పేర్కొంది. కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు ప్లాన్ చేసింది. 65 కిలోమీటర్ల మేర బలగాలను, యుద్ధ వాహనాలను మోహరించింది. అందుకోసమే భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.


దూకుడు పెంచిన భారత్


ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన 'ఆపరేషన్​ గంగ'ను వేగవంతం చేసింది భారత్. ఇందుకోసం వాయుసేనను రంగంలోకి దించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


వాయుసేనకు చెందిన సీ-17 ఎయిర్​ క్రాఫ్ట్​ను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించవచ్చు.


రాష్ట్రపతితో మోదీ


ఉక్రెయిన్​ సంక్షోభంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసి స్వయంగా వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆపరేషన్​ గంగ' పేరిట ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువస్తున్న విధానాన్ని రాష్ట్రపతికి వెల్లడించారు. వీలైనంత త్వరగా భారత విద్యార్థులు అందరినీ స్వదేశానికి తీసుకువస్తామని రాష్ట్రపతికి మోదీ వివరించారు.







ఇప్పటివరకు 6 విమానాల్లో 1396 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. తాజాగా 182 మంది భారతీయులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్​ నుంచి సోమవారం బయలుదేరిన విమానం ఈరోజు ముంబయి చేరుకుంది. మరో రెండు విమానాలు కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


Also Read: Russia Ukraine War: 'పుష్ప' స్టైల్‌లో పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్! పాల్ ఫైట్, RGV ట్వీట్!


Also Read: Ukraine Crisis: ఏమైనా కానీ, ప్రాణమే పోనీ- ఉక్రెయిన్‌ను విడిచి నేను రాను: 17 ఏళ్ల భారత విద్యార్థిని