Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మరోసారి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి 'ఆపరేషన్ గంగా' కింద కొనసాగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
ఆపరేషన్ గంగా చర్చ
"అక్కడ ఉన్న భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలూ పని చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు" అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారన్నారు. వారి తరలింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటి వరకూ 1,000కి పైగా పౌరులను దేశానికి తీసుకొచ్చారు. భారతీయులకు సహాయం చేయడానికి ప్రభుత్వం 24×7 నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. 'ఆపరేషన్ గంగా హెల్ప్‌లైన్' అనే ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈ మిషన్‌కు అంకితం చేయబడింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఔషధాలతో సహా మానవీయ సహాయాన్ని కూడా పంపాలని భారత్ నిర్ణయించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వార్తా సంస్థ ANIని తెలిపింది.
రెండో దఫా చర్చలు
ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడులు సోమవారం ఐదో రోజు కొనసాగుతోంది. వివాదానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు బెలారస్-ఉక్రెయిన్ సరిహద్దులో 4 గంటలపాటు చర్చలు జరిపాయి. అయితే, మీడియా నివేదికలు చర్చలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నాయి. రష్యా మీడియా ప్రకారం రెండు దేశాలు త్వరలో మరోసారి చర్చలు జరపవచ్చు.