Amul Milk Price Hike: అమూల్ సంస్థ వినియోగదారుడికి షాక్ ఇచ్చింది. పాల ధరలను భారీగా పెంచింది. పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్(Amul) పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ధరలు(Rates) అమల్లోకి రానున్నాయి. లీటరుకు రూ.2 పెరుగుదలతో ఎమ్.ఆర్.పీ(MRP)లలో 4% పెరగనుంది. ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువ అని అమూల్ సంస్థ తెలిపింది. దీని తర్వాత అమూల్ గోల్డ్ మిల్క్ ధర 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ ధర రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ.27 ఉంటుంది.
పెరిగిన ధరలు
1. 500 మి.లీ అమూల్ గోల్డ్ పాలు రూ. 30
2. 500 మి.లీ అమూల్ తాజా మిల్క్ రూ. 24
3. 500 మి.లీ అమూల్ శక్తి రూ. 27
మెట్రో సిటీల్లో ధరలు ఇలా
అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపుతో అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, ముంబయి మెట్రో మార్కెట్‌లలో ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్‌కు రూ.60, టోన్డ్ మిల్క్ అహ్మదాబాద్‌లో లీటరుకు రూ.48, దిల్లీ, ముంబయి, కోల్ కతాలో లీటరుకు రూ.50 అమ్మనున్నారు. గత ఏడాది జులైలో అమూల్ పాల ధరల(Milk Rates)ను చివరిసారిగా పెంచింది. ఇంధనం, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, పశువుల దాణా ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని అమూల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం నిర్వహణ, పాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని కంపెనీ పేర్కొంది.
రైతు సంఘాలను ప్రోత్సహించేందుకే
ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని సభ్య రైతు సంఘాలకు కిలో వెన్న(Fat) ధర రూ.35 నుంచి రూ.40 వరకు పెంచుతున్నామని అమూల్ ప్రకటించింది. గత సంవత్సరం కన్నా 5 శాతం ఎక్కువ అని పేర్కొంది. పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను అమూల్ పాల ఉత్పత్తిదారులకు అందజేస్తుందని పేర్కొంది. ధరల సవరణ పాల ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుందని, రైతు సంఘాలను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని అమూల్ కంపెనీ తెలిపింది.