Russia- Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు ఎప్పుడెప్పుడు స్వదేశానికి వద్దామా అని పడిగాపులు కాస్తున్నారు. విమానాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ హరియాణాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక మాత్రం ఉక్రెయిన్‌ను విడిచి రానంటుంది. ఎందుకో తెలుసా?


నేను రాను


"నేను ఉక్రెయిన్‌లోనే ఉంటాను. యుద్ధం ముగిసే వరకు భారత్‌కు రానేరాను" అంటూ ఆ బాలిక ఎందుకు చెబుతుందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. హరియాణాకు చెందిన 17 ఏళ్ల నేహా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. యుద్ధం మొదలవ్వడంతో తానుంటున్న హాస్టల్‌ పరిసరాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆ నగరంలోనే మరోచోట ఓ ఇంట్లో అద్దెకు దిగింది.


ఆ ఇంట్లో భార్యాభర్తలు, వారికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనేందుకు సైన్యంలో చేరి తుపాకీ పట్టాడు. ఇంటి పెద్ద సైన్యంలో చేరడంతో ఆ ఇంట్లో తల్లి, ముగ్గురు పిల్లలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.


దేశం కోసం ప్రాణాలకు తెగించిన ఆ పెద్దాయన కుటుంబాన్ని తాను చూసుకోవాలని అందుకే యుద్ధం ముగిసే వరకు తాను అక్కడే ఉంటానని నేహా చెబుతోంది. 


అమ్మకు చెప్పి


భారత సైన్యంలో విధులు నిర్వహించిన నేహా తండ్రి కొన్నేళ్ల క్రితమే ఓ దాడిలో మృతి చెందారు. ఇప్పుడు నేహా కూడా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడి నుంచి రాను అని చెప్పడంతో హరియాణాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న ఆమె తల్లి కంగారు పడుతున్నారు. కానీ నేహా తన తల్లికి ఫోన్‌ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.


ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని, ఈ కుటుంబానికి తన అండ అవసరమని అమ్మకు చెప్పింది. ఈ విషయాన్ని నేహా స్నేహితురాలు సవితా జఖార్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించింది.


హ్యాట్సాఫ్


ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 'నేహా నీకు సెల్యూట్' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు కదా. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలిచ్చే 'ఆపరేషన్ గంగా'ను కేంద్ర వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా భారత పౌరులను స్వదేశానికి చేర్చాలని ప్రయత్నిస్తోంది.


Also Read: Russia Ukraine War: 'పుష్ప' స్టైల్‌లో పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్! పాల్ ఫైట్, RGV ట్వీట్!


Also Read: Russia Ukraine War: భారత విద్యార్థులారా కీవ్ నగరం నుంచి వెంటనే బయలుదేరండి: భారత ఎంబసీ