KCR In Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో భాగంగా సోమవారం రాత్రి కేసీఆర్ ఢిల్లీకి (KCR Delhi Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో (Aravind Kejriwal) పాటు మరికొందరు జాతీయ స్థాయి కీలక నేతలతో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ జే.సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఇతన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. 


ఇప్పటికే ప్రత్యామ్నాయ కూటమి (Third Front) ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ కేజ్రీవాల్‌ సమావేశం (KCR Kejriwal Meet) అవుతారని తెలుస్తోంది. అయితే, కేసీఆర్, కేజ్రీవాల్ ఇలా భేటీ కావడం ఇదే తొలిసారి. వీరిద్దరి సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌తో భేటీ తర్వాత ఢిల్లీలోని కొన్ని జాతీయ పార్టీల నాయకులను కూడా కేసీఆర్ కలుస్తారు. విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ సమావేశం అవుతారు. జాతీయ ప్రత్యామ్నాయ వేదిక కోసం సహకారం అందించాలని వారిని ఆహ్వానించారు. 


కేంద్ర మంత్రులతోనూ భేటీ
ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలే కాకుండా కేసీఆర్ కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశం సహా నిధులు వంటి అంశాలకు సంబంధించి ఆయా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులను రప్పించడం, యాసంగి ధాన్యం కొనుగోలు, విభజన హామీలు - సమస్యలు, నిధులపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉండదని తెలుస్తోంది.


8న వనపర్తి పర్యటనకు కేసీఆర్ (KCR Wanaparthy Tour)
ఢిల్లీ పర్యటన అనంతరం మార్చి 8న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. అలాగే జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్ట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను, అలాగే టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.