Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 2 నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలను రష్యా హస్తగతం చేసుకోలేకపోయింది. ముఖ్యంగా ఉక్రెయిన్ బలగాలు పోరాడుతోన్న తీరు చూసి రష్యా సేనలు కూడా నివ్వెరపోతున్నట్లు పలు నివేదికలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త బాగా వైరల్ అవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌(69) వ్యక్తిగత జీవితంతో పాటు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తాజాగా వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో నిజమెంత?


పుతిన్‌కు ఏమైంది?


యుద్ధం తారస్థాయికి చేరుతున్న తరుణంలో పుతిన్‌ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోందన్న వార్తలు తెగ తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పుతిన్ పాల్గొన్న సమావేశాలు, హాజరైన బహిరంగ ర్యాలీలను అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. 


పుతిన్‌ తాజా ఫొటోలు, వీడియో ఫుటేజీల ఆధారంగా.. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో తీవ్రమైన మార్పులు వచ్చాయనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఎక్కువ సేపు నిల్చోలేకపోతుండడం, ఆయన చేతులు వణుకుతుండడం, ఆయాస పడుతుండడం, అలాగే ఆయన ముఖం ఏదో ఒక రకమైన కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు కనిపిస్తుందని వాదిస్తున్నారు.


న్యూయార్క్ కథనం


ఒలింపిక్‌ అథ్లెట్స్‌ను గౌరవించే ఓ కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొనగా ఆ ఈవెంట్‌ ఫొటోల ఆధారంగా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయని న్యూయార్క్‌ పోస్ట్‌ సైతం ఓ కథనం ప్రచురించింది. బెలారస్‌ అధ్యక్షుడితో భేటీ సందర్భంలోనూ పుతిన్‌ టేబుల్‌ను సపోర్ట్‌గా పట్టుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పుతిన్‌ ఆరోగ్యంపై కథనం ప్రచురించింది న్యూస్‌ వీక్‌. 






అలాంటిదేం లేదు


ఈ వార్తలను క్రెమ్లిన్ (రష్యా అధికార భవనం) ఖండించింది. రష్యా సేనలను బలహీన పరిచేందుకు ఇది పాశ్చాత్య దేశాలు పన్నిన కుట్రగా రష్యా అభివర్ణించింది.