PM Modi Foreign Visit: ప్రధాని నరేంద్ర మోదీ 2022లో తొలి విదేశీ పర్యటనకు రెడీ అయిపోతున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని మోదీ ఐరోపాలోని జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ద్వైపాక్షిక భేటీ
పర్యటనలో భాగంగా మొదట బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొంటారు. వీరిద్దరూ భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో ఎడిషన్‌కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
డెన్మార్క్
ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్‌హాగన్‌కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం భారత్- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో మోదీ పాల్గొంటారు.
శుభాకాంక్షలు
ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్‌లో ఆగనున్నారు. నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను కలిసి మోదీ శుభాకాంక్షలు తెలపుతారు.
అయితే ఈ పర్యటనలో మోదీ జరిపే సమావేశాల్లో ఉక్రెయిన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టడంపై భారత్ స్టాండ్ స్పష్టం చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. కానీ భారత్ మాత్రం శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది.
2022లో ఇదే ప్రధాని మోదీ తొలి ఫారిన్ టూర్. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు మోదీ హాజరయ్యారు.
Also Read: Weather Impact on Indian Economy: ఎంత పని చేశావ్ సూరీడు- నీ వల్ల గంటకు రూ.5 వేల కోట్లు నష్టం!
Also Read: Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !