పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్న కేంద్రం... పన్నులు తగ్గించాలని రాష్ట్రాలకు చెప్పడమేంటని నిలదీస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు తగ్గించడం లేదని సీఎంలతో జరిగిన వర్చువల్ భేటీలో ప్రధాని కామెంట్ చేశారు. దీనిపై ఆయా రాష్ట్రాల సీఎంలు గట్టిగానే కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఘాటుగా బదులిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారిగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను పెంచలేదని... అలాంటప్పుడు తగ్గించాల్సింది ఎవరో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చెప్పాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్లీనరీ వేదికగా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ ఏమన్నారంటే " ప్రధానమంత్రి డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారు. మూడు నాలుగు గంటలు ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని ఉండాలి. వాళ్లు చెప్పేది వినాలి. కరోనా మళ్లీ విజృంభిస్తున్న టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం పెట్టారు. కానీ వాళ్లు మాట్లాడింది మాత్రం ట్యాక్సులపై. కనీసం చెప్పడానికి సిగ్గు, ఎగ్గు ఉండాలి కదా... ప్రజల మీద భారం వేయొద్దంటే మరి మీరెందుకు పెంచుతున్నారు. ఏ నోరుతో రాష్ట్రాలను తగ్గించమంటారు. ఇదేం నీతి. ఇంత దుర్మార్గమా.. ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా.. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వెందుకు పెంచినావ్. దేని కోసం పెంచుతున్నావ్. లేని సెస్సులు ఎందుకు మోపుతున్నావ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. 2015లో ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేయమని చెప్తే.. కొన్ని పైసలు అటూ ఇటూ చేసి సవరించాం. అంతే. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెంచిన పాపాత్మురాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఏ నోటితో తెలంగాణకు ట్యాక్స్ కట్టాలని అడుగుతారు. మేం పెంచనే లేదు. అలాంటిది మమ్మల్ని ఎలా తగ్గించమంటావ్ " అని కేసీఆర్ మోదీని నిలదీశారు.
బలమైన కేంద్రం.. బక్క రాష్ట్రాలు అనే కుటిల నీతితో కేంద్ర పాలిస్తుందన్నారు కేసీఆర్. ఇంత నీచమైన పరిస్థితి దేశంలో గతంలో ఎన్నడూ లేదని అన్నారు. డీజీల్, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతే ఆర్టీసీ బతకాలా చావాలా అని ప్రశ్నించారు. రెండు నుంచి మూడు వేల కోట్లు ఇచ్చి తెలంగాణ ఆర్టీసీని బతికింటుంటున్నామని... అయినా దీన్ని కూడా అమ్మేయాలని మోదీ సలహా ఇస్తున్నారన్నారు. కేంద్రం అమ్మేస్తున్నట్టు ప్రభుత్వ ఆస్తులు అమ్మేయాలని ఉచిత సలహాలు మోదీ ఇస్తున్నారని మండిపడ్డారు. అలా ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వెయ్యి కోట్లు అదనంగా ఇస్తామంటూ ఆఫర్స్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ విజ్ఞప్తిలో రాజకీయ ఎజెండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులను కేంద్రం పెంచుతూ ఇప్పుడు తగ్గించాలని రాష్ట్రాలకు చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. పశ్చిమ బెంగాల్ మూడేళ్లుగా రూపాయి సబ్సిడీ ఇస్తోందని దీని వల్ల పదిహేను వందల కోట్లు నష్టపోయిందన్నారు. తాము కేంద్రం తీరుతో 97వేల కోట్లు నష్ట పోయామని... అది ఇస్తే కచ్చితంగా సబ్సిడీ ఇస్తామని తేల్చేశారు మమత.
తమిళనాడులో పెట్లోల్ ధరలపై మూడు రూపాయలు తగ్గించామని ఇప్పుడు ఇంకా తగ్గించాలని కేంద్రం చెప్పడం బాగాలేదన్నారు డీఎంకే నేతలు. సెస్ వాసూలు చేస్తూ దాన్ని వ్యాట్‌గా మార్చవద్దని కోరారు. పెట్రోల్ ప్రైస్‌పై ఎనిమదేళ్లుగా వసూలు చేసిన సొమ్ము ఎక్కడుందని ప్రశ్నించారు.
పెట్రోల్ ధరల పెరుగుదల ముమ్మాటికీ కేంద్రం తప్పిదమే అంటున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఇందులో రాష్ట్రాలను లాగి విషయాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు.