Pakistan National Assembly: 



పార్లమెంట్ రద్దు 


ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనల మేరకు పాకిస్థాన్ పార్లమెంట్ రద్దైంది. ఇక ఎన్నికలకు సిద్ధమవుతోంది దాయాది దేశం. ఇప్పటికే పాక్‌లో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఆర్థికంగా పూర్తిగా చతికిలపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతుండటం ఉత్కంఠగా మారింది. ఆ దేశ భవిష్యత్‌ని ఈ ఎన్నికలే నిర్ణయించనున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఫలితంగా ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ మొత్తం పరిణామాల్లో ప్రస్తుతం పాక్ అధ్యక్షుడు అల్వీ పాత్రే కీలకంగా మారనుంది. మరో మూడు రోజుల్లో మధ్యంతర ప్రధానిని నియమించాలని ఇప్పటికే ఆదేశించారు. మరో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనీ తేల్చి చెప్పారు. అయితే..ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఓ బాంబు పేల్చింది. వచ్చే ఏడాది వరకూ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ ప్రకటనతో మరోసారి పాక్‌లో రాజకీయ అనిశ్చితి మొదలైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం...పాకిస్థాన్‌లో ఎన్నికలు ఆలసమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోడం కష్టంగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వం మారితే మరింత గందరగోళ పరిస్థితులు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఇటు పాక్‌లో ఈ  సంక్షోభం అటు అమెరికానీ కంగారు పెడుతోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


"పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నాం. ఇప్పటికే అక్కడ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో మా మిత్ర దేశాలతో కలిసి ముందుకెళ్తాం"


- జాన్ కిర్బీ, వైట్ హౌజ్ ప్రతినిధి 


ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ 


2018లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (PTI) ఘన విజయం సాధించింది. గెలిచిన మూడు రోజుల తరవాత ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సారి మాత్రం ఆయనకు పోటీ చేసే అవకాశమే లేకుండా పోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మూడు సార్లు పాక్ ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ మిలిటరీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించడం, ఆ తరవాత ఆయనపై దాడి జరగడం, ఇప్పుడు జైలుకి వెళ్లడం...ఈ పరిణామాలన్నీ ఎన్నో సందేహాలకు దారి తీస్తున్నాయి. కావాలనే ఇమ్రాన్‌ ఖాన్‌ని తప్పించి దేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని పాక్ మిలిటరీ ప్రయత్నిస్తోందా అన్న వాదనా వినిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ బయటకు రాకుండా ఆయనపై 200 కేసులు పెట్టారు. "నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను" అని తన లాయర్స్‌తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖాన్. అయినా..ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు. ముందు ముందు పాకిస్థాన్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. 


Also Read: అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు? రాహుల్ స్పీచ్‌తో పెరిగిన ఉత్కంఠ