No-Confidence Motion:


అవిశ్వాస తీర్మానంపై చర్చ..


ప్రస్తుతం పార్లమెంట్‌లో మణిపూర్‌ అంశం పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా దూకుడుగా మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తరవాత కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అమిత్‌షా కాంగ్రెస్‌ని టార్గెట్‌గా చేసుకుని గట్టిగానే బదులిచ్చారు. అధికారాన్ని నిలబెట్టుకోడం కోసం పాకులాడిన ఆ పార్టీయా నీతులు చెప్పేది అంటూ ఇద్దరు మంత్రులూ దీటుగా సమాధానం చెప్పారు. అమిత్‌షా ప్రసంగిస్తుంటే బీజేపీ ఎంపీలంతా మోదీ మోదీ అంటూ నినదించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌తో పాటు యూపీఏని కూడా ఏకిపారేశారు అమిత్‌షా. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై సమాధానం చెప్పనున్నారు. ఇప్పటికే మణిపూర్‌ చుట్టూ రాజకీయాలు వేడెక్కగా మోదీ ఏం మాట్లాడతారో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ఆయన ఈ సారి ఆ విమర్శల డోస్ ఇంకా పెంచే అవకాశాలున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే మోదీ సర్కార్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ..రాహుల్ గాంధీ ప్రసంగం తరవాత ప్రధాని మోదీ సమాధానమిస్తుండటమే ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తారా..? లేదంటే మణిపూర్ సమస్యకి ఏదైనా పరిష్కార మార్గం చెప్తారా అన్నదీ తేలాల్సి ఉంది. ప్రధాని మోదీ మణిపూర్‌పై పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేయాలని, కచ్చితంగా మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్‌కు తగ్గట్టుగానే మాట్లాడుతూ, గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. 


వ్యూహం ఏంటి..?


లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు జరగడం బీజేపీకి ఎంతో కొంత ఇబ్బందికరమే. అందుకే...విపక్షాల దాడికి, మోదీ తప్పకుండా ఎదురు దాడి చేస్తారని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతారన్నదీ కీలకంగా మారింది. మణిపూర్‌లో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేయాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ..హైకమాండ్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. అమిత్‌ షా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఓ రాష్ట్రంలో ఇలాంటి అల్లర్లు జరిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహకరించనప్పుడు ఆయనను గద్దె నుంచి దించేందుకు అవకాశముంటుందని తేల్చి చెప్పారు. బైరెన్‌ సింగ్ కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్నారని అలాంటప్పుడు ఆయనను తప్పించాల్సిన అవసరం ఏముందని అమిత్‌ షా ఇప్పటికే విపక్షాలను ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ విషయంలోనూ ఇంకాస్త క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి. జమ్ముకశ్మీర్‌లోని ఆర్టికల్ 370 గురించి అమిత్ షా గట్టిగానే మాట్లాడారు. నెహ్రూ వల్లే ఆ ప్రాంతం అలా రక్తసిక్తం అయిందని విమర్శించి...మళ్లీ కాంగ్రెస్‌ని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ వ్యూహం కూడా అదే అయ్యుంటుందా అన్నదీ తేలాల్సి ఉంది. కశ్మీర్ మాట ఎత్తితే కాంగ్రెస్ సైలెంట్ అయిపోతుందని బీజేపీకి తెలుసు. దాంతో పాటు ఎమర్జెన్సీ అంశమూ ఎలాగో ఉంది. కీలెరిగి వాత పెట్టినట్టు...బీజేపీ పదేపదే ఈ అంశాలు ప్రస్తావించి కాంగ్రెస్ నోరు మూయించేందుకు ప్రయత్నిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు మణిపూర్‌ విషయంలోనూ ఏదో పరిష్కారం చూపిస్తూనే...కాంగ్రెస్‌ని మరోసారి ఆత్మరక్షణలో పడేసే అవకాశాలున్నాయి. 


Also Read: వాళ్ల ఆరాటం అధికారం కోసం, మా పోరాటం సిద్ధాంతాల కోసం - విపక్షాలపై అమిత్‌ షా విమర్శలు