Amit Shah Speech: 


పార్లమెంట్‌లో అమిత్‌షా ప్రసంగం


కేంద్రహోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. ఇది కేవలం ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు తీసుకొచ్చిన తీర్మానం అని అసహనం వ్యక్తం చేశారు షా. ఈ దేశ ప్రజలు పూర్తి మెజార్టీతో NDAని ఎన్నుకున్నారన్న ఆయన...దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఇంత నమ్మకం సంపాదించుకున్న ప్రభుత్వం మరేదీ లేదని స్పష్టం చేశారు. భారత దేశ చరిత్రలో అత్యుత్తమ ప్రధానిగా మోదీ నిలిచిపోతారని వెల్లడించారు. రోజుకి 17 గంటల పాటు పని చేసే ప్రధాని కేవలం మోదీయే అని ప్రశంసించారు. దేశ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు అమిత్‌ షా. క్విట్ ఇండియా నినాదంతో సెటైర్లు వేశారు. ఈ అవిశ్వాస తీర్మానం విపక్షాల అసలు రూపాన్ని బయట పెడుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలేవీ ఉచితాలు కావు అని స్పష్టం చేశారు. 


"అవిశ్వాస తీర్మానంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. విపక్షాలకు ఈ తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఉంది. కానీ ఈ నిర్ణయంతో విపక్షాల అసలు రూపమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 50 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రజలకు ఎలాంటి విశ్వాసం లేదు. నరేంద్ర మోదీ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టారు. కేవలం అభివృద్ధి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి గతంలో చాలా సార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ చరిత్రలోనే యూపీఏ అత్యంత అవినీతిమయమైన కూటమి. అందుకే ప్రధాని మోదీ అవినీతికి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా నినాదంతో బదులు చెబుతున్నారు"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి