Gyanvapi Survey: 


మీడియా కవరేజ్‌పై అసహనం..


జ్ఞానవాపి మసీదులో 7వ రోజు ASI సర్వే కొనసాగుతోంది. హిందూ ఆలయంపైన మసీదు నిర్మించారన్న వాదనల నేపథ్యంలో ఈ సర్వేపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు వారాల పాటు ఈ సర్వే కొనసాగనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...అటు ముస్లిం వర్గం మాత్రం ఈ సర్వేని బైకాట్ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ సర్వేపై స్టే విధించాలని పిటిషన్ వేశారు ముస్లింలు. దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పుడు మరోసారి పిటిషన్ వేశారు ముస్లింలు. ఈ సర్వేపై మీడియా కవరేజ్‌ని బ్యాన్ చేయాలని జిల్లా కోర్టు జడ్జ్‌ని కోరారు. 


"కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకూ ఏ అధికారి కూడా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ, వ్యాఖ్యలు చేయలేదు. అటు మీడియాలో, సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా దీన్ని కవరేజ్ చేస్తోంది. ఇది ప్రజల్ని, సర్వేని మిస్‌ లీడ్ చేస్తోంది. సర్వేపై వేరే ఏ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి"


- ముస్లింలు 


కొనసాగుతున్న సర్వే..


ఆరో రోజు సర్వేలో మసీదులోని పునాదిని, డోమ్స్‌ని కొలిచారు. అదే సమయంలో మసీదులోని ఉత్తర దిక్కునున్న గోడలపైనా సర్వే నిర్వహించారు. ప్రత్యేక యంత్రాలతో ఇది కొనసాగుతోంది. 3D ఇమేజింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో సర్వే చేస్తున్నారు. ఫొటోగ్రఫీతో ప్రతి ఒక్క విషయాన్ని రికార్డ్ చేస్తున్నారు. మొదటి రోజు సర్వేని బైకాట్ చేసినప్పటికీ ఆ తరవాత ముస్లింలు కూడా లోపలకు వెళ్లారు. మొత్తం మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ సైంటిఫిక్ స్టడీ కొనసాగిస్తున్నారు. 


త్రిశూలం...


 బేస్‌మెంట్‌లో చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందువులు చెబుతున్న ప్రకారం...మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు అడుగుల శివుడి విగ్రహం దొరికింది. ఈ విగ్రహంతో పాటు 2 అడుగుల త్రిశూలం కూడా ఉంది. అంతే కాదు. అక్కడి గోడలపై కమలం పువ్వు గుర్తులు కనిపించినట్టు హిందువులు చెబుతున్నారు. ఓ జంతువు విగ్రహంతో పాటు, ఓ దేవత విగ్రహం కూడా గుర్తించినట్టు వివరించారు. మరి కొన్ని విగ్రహాల శకలాలు కనిపించినట్టు తెలిపారు. భారీ భద్రత నడుమ సర్వే జరుగుతోంది. మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రత్యేక యంత్రాలు తెప్పించి మరీ సర్వే చేస్తున్నారు. 


"మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాం. అక్కడ ఉన్న గడ్డిని పూర్తిగా తొలగించాం. మధ్యలో ఉన్న మినార్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. అవేంటని సర్వే చేస్తున్నాం. ఆ ప్రాంతాన్ని ఎవరో కావాలనే దాచి ఉంచినట్టు గుర్తించాం. అందుకే సర్వేకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కోర్టు మాకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. పని వేగంగానే జరుగుతోంది. రేడార్ మెషీన్ వినియోగించి సర్వే చేస్తున్నాం. ఫలితాలు వచ్చేంత వరకూ దయచేసి అంతా ఓపిక పట్టండి"


- విష్ణు శంకర్ జైన్, అడ్వకేట్ 


Also Read: మణిపూర్‌ సాక్షిగా బీజేపీ భరత మాతను హత్య చేసింది, రాహుల్ సంచలన వ్యాఖ్యలు