Pakistan Beggars:
బిచ్చగాళ్ల వలసలు..
పాకిస్థాన్ చైనాకి గాడిదలను ఎగుమతి చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మనకి తెలియని విషయం మరోటి ఉంది. పాకిస్థాన్ బిచ్చగాళ్లనూ ఎగుమతి చేస్తోంది. కాస్త షాకింగ్‌గా అనిపించినప్పటికీ..ఇది నిజమే. పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున బిచ్చగాళ్లు సౌదీ అరెబియా, ఇరాక్‌కి వలస వెళ్తున్నారు. "బాబోయ్ మీ దేశం నుంచి ఆ బిచ్చగాళ్లు రాకుండా ఆపండి" అని సౌదీ అరేబియా ప్రభుత్వం నెత్తి బాదుకుంటోంది. అంతగా రభస సృష్టిస్తున్నారట వాళ్లు. అంతే కాదు. మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అవుతున్న జేబు దొంగల్లో ఎక్కువ మంది పాకిస్థాన్ వాళ్లే ఉన్నారట. దీనంతటికీ కారణం పాకిస్థాన్ దారుణ స్థితిలో ఉండడమే. అక్కడ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏది కొందామన్నా కష్టంగానే ఉంది. సామాన్యులు నలిగిపోతున్నారు. కాస్తో కూస్తో ఉన్న వాళ్లు ఏదోలా బండి నెట్టుకొస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల దారుణంగా పెరిగాయి. అందరి దగ్గరా డబ్బులుంటే బిచ్చగాళ్లకు వేస్తారు. కానీ...డబ్బుల్లేక ఆగం అవుతుంటే వాళ్లకు భిక్ష ఎవరు వేస్తారు..? అందుకే అక్కడి నుంచి బిచ్చగాళ్లంతా పశ్చిమాసియా దేశాలకు వలస పోతున్నారు. ఆయా దేశాల్లో అరెస్ట్ అయిన బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్థాన్ నుంచి వచ్చిన వాళ్లే. ఇరాక్, సౌదీ అరేబియా జైళ్లలో వీళ్లంతా మగ్గుతున్నారు. ఇరాక్, సౌదీ అరేబియాకి పాకిస్థాన్ నుంచి చాలా మంది బిచ్చగాళ్లు వలస వస్తున్నారు. తీర్థ యాత్రికుల్లా వేషం వేసుకుని మెల్లగా దేశంలోకి వస్తున్నారు. ఆ తరవాత వీధుల్లో బిచ్చం ఎత్తుకుంటున్నారు.
కొత్త సమస్య..
ఈ విషయాన్ని పాకిస్థాన్ Secretary of Overseas Pakistanis కూడా ధ్రువీకరించింది. దాదాపు కోటి మంది పాకిస్థాన్ పౌరులు విదేశాల్లో ఉంటున్నట్టు వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది భిక్షాటన చేస్తున్నట్టు వివరించింది. వీళ్లంతా వీసాలు తీసుకుని మరీ ఆయా దేశాలకు వెళ్తున్నారు. మిడిల్ ఈస్ట్ అంతా పాకిస్థాన్ బిచ్చగాళ్లతో నిండిపోతోందని ఆయా దేశాలు వాదిస్తున్నాయి. ప్రస్తుత లెక్క ప్రకారం UAEలో దాదాపు 16 లక్షల మంది, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థాన్ పౌరులున్నారు. వీరిలో ఎక్కువ మంది భిక్షాటన వృత్తిలోనే ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలి నానా తంటాలు పడుతున్న పాకిస్థాన్‌కి ఈ సమస్య మెడకు చుట్టుకుంది. పాకిస్థాన్‌లో పేదరికం 39.4%కి పెరిగింది. దాదాపు కోటి 20 లక్షల మంది పేదరికంలో జారిపోయారు.
పాక్ దుస్థితిపై ఇటీవలే నవాజ్ షరీఫ్ మాట్లాడారు. ‘‘నేడు దేశంలో పేదలు ఆహారం కోసం వెంపర్లాడుతున్నారు. దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? 2017లో పాకిస్థాన్‌లో ఇది కనిపించలేదు. అప్పట్లో పిండి, నెయ్యి, పంచదార అన్నీ చౌకగా దొరికేవి. కరెంటు బిల్లులు ప్రజల స్తోమతకు తగ్గట్టుగానే వచ్చేవి. నేడు ప్రజలకు రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను పోషించేందుకు కూడా డబ్బులు మిగలడం లేదు. నా పాలనలో దేశం పురోగమించింది. అయినప్పటికీ, నాకు కోర్టులో 27 సంవత్సరాల శిక్ష వేసింది. నాపై అనర్హత వేటు వేసింది. కొన్నాళ్లు దేశం బయట ఉండాల్సి వచ్చింది. వీటన్నింటి వెనుక జనరల్ బజ్వా, జనరల్ ఫైజ్ ఉన్నారు’’ అని ఆవేదన చెందారు.
Also Read: భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు