అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం కానున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఎస్.జైశంకర్-బ్లింకెన్ మీటింగ్‌లో.. భారత్-కెనడా మధ్య దౌత్యవివాదంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే... బ్లింకెన్‌తో సమావేశానికి ముందు కెనడా ఆరోపణలోను మరోసారి ఖండించింది భారత్. కెనడా ఆరోపణలు నిరాధారమైనవని జైశంకర్ ప్రకటించారు. అయితే అమెరికా మాత్రం పాతపాటే పాడింది. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరింది అమెరికా.
మధ్యాహ్నం ఎస్.జైశంకర్-బ్లింకెన్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయంపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ నిరాకరించారు. జైశంకర్-బ్లింకెన్ సమావేశాల ఎజెండా తాను చెప్పదలుచుకోలేదని అన్నారు. అయితే... కెనడా అంశంలో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పామన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని మరోసారి వ్యాఖ్యానించారు.
గత వారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్‌లో జైశంకర్- బ్లింకెన్ సమావేశమయ్యారు. అయితే, ఆ సమావేశంలో భారత్-కెనడా దౌత్యవివాదంపై చర్చ జరగలేదని సమాచారం. మంగళవారం న్యూయార్క్‌లోని కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్‌లో మాట్లాడుతూ... కెనడా చేసిన ఆరోపణలపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించారు జైశంకర్. విధానపరంగా భారత్ అలాంటి చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని ఆరోపణలపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని మిస్టర్ బ్లింకెన్ అన్నారు. అమెరికా జవాబుదారీతనం చూడాలని కోరుకుంటోందని... ఈ విషయంలో దర్యాప్తు జరిగడం ముఖ్యమని భావిస్తున్నామన్నారు. కెనడా ఆరోపణలను భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని.. అవి నిరాధార ఆరోపణలని ఖండించింది. నిజ్జర్ హత్యకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం అందిస్తే..దర్యాప్తు చేస్తామని జైశంకర్ కెనడాకు స్పష్టంగా తెలియజేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో... ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం రాజుకుంది. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించగా... అగ్రరాజ్యం అమెరికా కెనడాకు అనుకూలంగా వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. కెనడా ఆరోపణలపై భారత్ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా పదేపదే సూచిస్తోంది. అంతేకాదు నిజ్జర్ హత్యపై నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యమే కెనడాకు ఇచ్చినట్లు కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జైశంకర్-బ్లింకన్ మీటింగ్‌పై ఆసక్తి రేగుతోంది.