తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని సమాచారం. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్‌ పెడుతున్నాయి.  ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ... డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు విడతల వారిగా పేదలకు అందిస్తూ.. ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక.. కాంగ్రెస్‌  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇక... బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నికలకు సమయంలో ఎక్కువగా లేకపోవడంతో...  రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది.


వచ్చే నెలలో అంటే అక్టోబర్‌లో 30 నుంచి 40 సభలు ఏర్పాటు చేయబోతోంది కమలం పార్టీ. ఆ సభలను పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల  ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతోంది. భారీ స్థాయిలో సభలు నిర్వహించి... ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు వివరించాలని  ప్రణాళిక వేసుకుంది. అంతేకాదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరించబోతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించబోతోంది. 


వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభల నిర్వహణకు ప్లాన్‌ చేస్తోంది. 17లోక్‌సభ  స్థానాల్లోనూ సభ పెట్టాలని భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మేలు కోసం చేపట్టే కార్యక్రమాలను ఈ సభల ద్వారా వివరించనున్నారు కమలం పార్టీ  నేతలు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక.. ప్రచారంలో మరింత వేగం పెంచాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.  అక్టోబర్‌ 1వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.  ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగసభలు కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ బీజేపీ. మోడీ సభల ద్వారా ఎన్నికల శంఖారం పూరించి... ఆ తర్వాత ప్రచారంలో వేగం  పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తర్వాత... అక్టోబర్‌ 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించబోతున్నారు. రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు  జేపీ నడ్డా. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత... అక్టోబర్‌ 7న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి  అమిత్‌షా సభ ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఆదిలాబాద్‌లో సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇలా... పార్టీ  జాతీయ నేతలను తెలంగాణకు ఆహ్వానించి... వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ  పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తోంది తెలంగాణ బీజేపీ.


ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి... నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారులు, సీనియర్‌ నేతల సమావేశంలో జరిగింది. తెలంగాణ  అభివృద్ధికి... మోడీ సర్కార్‌ ఇప్పటికే వేల కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు రాష్ట్ర బీజేపీ నేతలు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం అక్టోబర్‌ 1న ప్రధాని మోడీ  మహబూబ్‌నగర్‌ రాబోతున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అక్టోబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్‌లో బహిరంగసభ ఉంటుందని తెలిపారు. అలాగే...అక్టోబరు  3న మధ్యా హ్నం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కాలేజీ గ్రౌండ్‌లో సభ ఉంటుందని ప్రకటించారు.