India's First PM: 



తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్..


కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్ యత్నల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ కాదని కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన నెహ్రూ మన తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోసే మొట్టమొదటి ప్రధాన మంత్రి అని షాక్ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ భయపెట్టడం వల్లే బ్రిటీష్ వాళ్లంతా ఇండియా విడిచి పారిపోయారని అన్నారు. 


"మన దేశానికి తొలి ప్రధానమంత్రి అందరూ అనుకుంటున్నట్టుగా జవహర్ లాల్ నెహ్రూ కాదు. మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్. ఆయన పోరాటం వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఆయనకు భయపడే బ్రిటీష్ వాళ్లు ఇండియా వదిలి పారిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత బ్రిటీషర్లు వెళ్లిపోయారు. బ్రిటీషర్లు వదిలెళ్లే ముందు దేశంలో కొన్ని ప్రాంతాలకు స్వాతంత్య్రం ఇచ్చారు. ఆ ప్రాంతాలన్నింటికీ సుభాష్ చంద్రబోస్ ప్రధానిగా ఉన్నారు. వాళ్లకు ప్రత్యేక జెండానే కాదు. కరెన్సీ, జాతీయ గీతం కూడా ఉన్నాయి. అందుకే ప్రధాని మోదీ నెహ్రూని తొలిప్రధానిగా ఎప్పుడూ ఒప్పుకోలేదు. సుభాష్ చంద్రబోస్‌నే మొదటి ప్రధాని అని మోదీ కూడా చెప్పారు"


- బసన్‌గౌడ పాటిల్, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే 


గతంలో రాజ్‌నాథ్ కూడా..


ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పాటిల్‌కి కొత్తేం కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6-7 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అంతర్గత కలహాలతో ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలూ అప్పట్లో దుమారం రేపాయి. నిజానికి గతేడాది రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అఖండ భారతానికి తొలి ప్రధాని నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని తేల్చి చెప్పారు. ఆయన సేవల్ని ఈతరం పెద్దగా గుర్తించడం లేని అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్థాపించిన Azad Hind Fauj, Azad Hind Sarkar అఖండ భారతానికి తొలి ప్రభుత్వాలు పని చేశాయని, ఇదే తొలి స్వదేశీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. 


1943 అక్టోబర్ 21వ తేదీన సుభాష్ చంద్రబోస్ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారని వివరించారు. అప్పటికి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక స్టాంప్‌లు, కరెన్సీ, సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్‌ కూడా ఉండేదని చెప్పారు. అప్పట్లోనే ఇలాంటి వ్యవస్థను సృష్టించుకోవడం సాధారణ విషయం కాదని సుభాష్ చంద్రబోస్‌పై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. బ్రిటీషర్‌లు ఆయనను అణిచివేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారని, విదేశీ పాలన పోవాలన్న తన కలను సాకారం చేసుకున్నారని వెల్లడించారు రాజ్‌నాథ్. తాను హోం మంత్రిగా పని చేసిన రోజుల్లో బోస్‌ కుటుంబ సభ్యుల్ని కలిశానని చెప్పిన ఆయన...పలు కీలక డాక్యుమెంట్స్‌ని పరిశీలించినట్టు చెప్పారు. దేశంకోసం ఆయన ఎంత తపన పడ్డారో ఆ డాక్యుమెంట్స్‌ ద్వారా తెలిసిందని వివరించారు. 


Also Read: జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఇంకా ఫైనల్ కాని లా కమిషన్ రిపోర్ట్