One Nation One Election: 



లా కమిషన్ భేటీ..


ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ (Law Commission) చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. లా కమిషన్ ఏం చెబుతుంది..అని ఉత్కంఠగా ఎదురు చూసినప్పటికీ ఏ ప్రకటనా రాలేదు. దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నారు జస్టిస్ రీతూరాజ్. అందుకే రిపోర్ట్‌ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని వెల్లడించారు. 


"ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నివేదికను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. దీంతో పాటు పోక్సో యాక్ట్, ఆన్‌లైన్ FIRలకు సంబంధించిన రిపోర్ట్‌లు కూడా ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది."


- జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి, లాకమిషన్ చైర్మన్


2018లోనే డ్రాఫ్ట్..


దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఒకేదేశం, ఒకే ఎన్నిక ఎజెండా. 2018లోనే ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ని కేంద్ర న్యాయశాఖ ఓ నివేదికను సమర్పించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల చాలా వరకూ ప్రజాధనాన్ని ఆదా చేసుకోవచ్చని వెల్లడించింది. అటు పరిపాలనా యంత్రాంగంపైనా ఒత్తిడి తగ్గుతుందని స్పష్టం చేసింది. భద్రతా బలగాలపైనా ఒత్తిడి తగ్గడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు వీలవుతుందని తెలిపింది. అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు అవకాశముంటుందని వివరించింది. అయితే...రాజ్యాంగంలో ఉన్న ప్రస్తుత నిబంధనలు పాటిస్తూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. జమిలి ఎన్నికలకు వెళ్తే ఓ అసెంబ్లీ గడువు ముగియకుండానే రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు మిగిలిన కాలం ఎంత ఉందో అంత వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధుల చట్టం 1951లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని లా కమిషన్ ప్రతిపాదించింది. గతంలో 1951-52లో, 1957,1962,1967లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 


ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఈ కమిటీలోని 8 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. వీరందరికీ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది. అంతే కాదు. ఇందుకోసం రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయాల్సి ఉంటుందా అన్నదీ చర్చించనున్నారు సభ్యులు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. 


Also Read: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూత