M S Swaminathan passes away:


ఎమ్ ఎస్ స్వామినాథన్ కన్నుమూత..


ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్ (M S Swaminathan Demise) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. ఉదయం 11.20 నిముషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు.  1925 ఆగస్టు 7న జన్మించారు స్వామినాథన్. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన ఆయన చివరి శ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌ని తెరపైకి తీసుకురావడమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 2006లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ పలు సిఫార్సులు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు మరి కొన్ని సిఫార్సులు చేసింది. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. హరిత విప్లవ పితామహుడిగానూ పేరు సంపాదించుకున్నారు ఎమ్‌ఎస్ స్వామినాథన్. వృద్ధాప్యం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 1972 నుంచి 1979 వరకూ 'Indian Council of Agricultural Research' ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు స్వామినాథన్. 


మంకొంబు సాంబశివన్ స్వామినాథన్


ఎమ్‌ఎస్ స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయనకు ముగ్గురు కూతుర్లు. సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యారావ్. వీరిలో సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో చీఫ్ సైంటిస్ట్‌గా పని చేశారు. 1987లో International Rice Research Institute (IRR) కి డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. ఆ సమయంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన World Food Prize ఆయనని తొలిసారి వరించింది. నోబెల్ ప్రైజ్ ఎలాగో..వ్యవసాయ రంగంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అలా. జీవితమంతా వ్యవసాయ రంగానికే అంకితం చేసిన స్వామినాథన్‌ని మొత్తం 40 అవార్డులు వరించాయి. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంబకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎమ్‌కే సాంబశివన్, పార్వతి తంగమ్మల్. తండ్రి ఎమ్‌కే సాంబశివన్ ఓ సర్జన్. కొడుకు కూడా మెడిసిన్ చదివితే బాగుంటుందని తండ్రి కోరుకున్నారు. కానీ...స్వామినాథన్ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా అందరికీ సరిపడ ఆహారం అందాలన్నదే ఆయన లక్ష్యం.


ఎన్నో అవార్డులు..


1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌లో తీవ్ర కరవు వచ్చింది. ఆ సమయంలో ప్రజలు తిండి లేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులను చాలా దగ్గర నుంచి చూసిన స్వామినాథన్..అప్పుడే తాను వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. భారత ప్రభుత్వం స్వామినాథన్‌ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. ఇక అంతర్జాతీయ అవార్డుల విషయానికొస్తే...1971లో Ramon Magsaysay Award, 1986లో Albert Einstein World Science Award అవార్డులు వరించాయి. 20వ శతాబ్దపు ప్రముఖ ఆసియా వ్యక్తుల్లో ఒకరిగా Time Magazine లో చోటు దక్కించుకున్నారు. 1999లో ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది. 


Also Read: World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు