Punjab Students:
విద్యార్థులకు రూ.3 కోట్లు..
పంజాబ్ ప్రభుత్వం చేసిన ఓ చిన్న పొరపాటు తలనొప్పి తెచ్చి పెట్టింది. అనుకోకుండా విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3 కోట్ల స్కాలర్‌షిప్ అమౌంట్ క్రెడిట్ అయింది. దాదాపు 24 వేల మంది అకౌంట్‌లలో ఆ డబ్బులు జమ అయ్యాయి. వెంటనే పొరపాటుని గుర్తించిన ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక సతమతమైంది. చివరకు ఆ డబ్బులను రికవర్ చేసే బాధ్యతని టీచర్లకే అప్పగించింది. ఇప్పుడు టీచర్‌లంతా ఆ డబ్బుని వెనక్కి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. 2022-23 అకాడమిక్ సెషన్‌కి స్కాలర్‌షిప్ మనీ ఇవ్వాల్సి ఉంది. అయితే..పంజాబ్ విద్యాశాఖ ఇవ్వాల్సిన దాని కన్నా అదనంగా రూ.3 కోట్లు పొరపాటున జమ చేసింది. అందుకే అన్ని స్కూల్స్‌కీ ఓ నోటీసు పంపింది. నిజానికి ఒక్కో విద్యార్థికి రూ.1,400 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలి. కానీ...పొరపాటున 23,001 మంది విద్యార్థుల అకౌంట్‌లకు రూ.2,800 మిగతా 674 మంది విద్యార్థుల అకౌంట్‌లలో రూ.4,200 జమ అయ్యాయి. అయితే..టెక్నికల్ గ్లిచ్ కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది విద్యాశాఖ. స్కూల్ హెడ్స్‌తో పాటు DEOలు ఈ డబ్బులను ఎలాగోలా రికవర్ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 20వ తేదీలోగా ఈ పని పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. కానీ...ఈ డబ్బుని రికవర్ చేయడం అంత సులువైన పని కాదని అంటున్నారు ఉపాధ్యాయులు.
టెక్నికల్ గ్లిచ్ సాకు..
9,10వ తరగతి విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఇస్తోంది ప్రభుత్వం. అయితే..వీరిలో చాలా మంది మెట్రిక్యులేషన్ పాస్ అయ్యి వేరే స్కూళ్లలో జాయిన్ అయిపోయారు. అలాంటి విద్యార్థుల నుంచి మనీ రికవర్ చేయడమే అసలు సమస్య. టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తమ తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ చేసిన తప్పుకి టీచర్‌లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతే కాదు. రికవర్ చేయకపోతే టీచర్‌లకు పెనాల్టీలు కూడా విధిస్తారట. అయినా తప్పని పరిస్థితుల్లో ఉపాధ్యాయులంతా డబ్బుని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వెంటనే ఈ పని మొదలు పెట్టినా వాళ్లు చెప్పిన తేదీ నాటికి అంత డబ్బు రికవరీ చేయడం కష్టమే అంటున్నారు.