Financial Rules Changing From 1 Oct 2023: సెప్టెంబర్ నెల ముగుస్తోంది, అక్టోబర్‌ నెల ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ ప్రారంభం నుంచే, డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఆ మార్పులు నేరుగా సామాన్య జనం జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అక్టోబర్‌లో.. క్రెడిట్, డెబిట్ కార్డులు, స్పెషల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సహా తదితర అనేక నిబంధనల్లో మార్పులు రానున్నాయి. వాటి గురించి ముందే తెలుసుకుంటే, మీ పర్స్‌పై పడే అదనపు భారం నుంచి తెలివిగా తప్పించుకోవచ్చు.


1. క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌ రూల్స్‌లో మార్పులు
అక్టోబర్ 1, 2023 నుంచి, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌కు సంబంధించిన కీలక మార్పు రాబోతోంది. ఆ నెల నుంచి, కొత్త క్రెడిట్ కార్డ్‌ లేదా డెబిట్ కార్డ్‌ను తీసుకునే సమయంలో, కార్డ్‌ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ కస్టమర్‌కు ఉంటుంది. అంటే, వీసా, మాస్టర్‌ కార్డ్‌, రూపే వంటి ప్రొవైడర్లలో ఎవరి కార్డ్‌ కావాలో కస్టమర్‌ ముందే నిర్ణయించుకోవచ్చు. ఇప్పటి వరకు, కస్టమర్‌ అభిప్రాయంతో సంబంధం లేకుండా బ్యాంకులే తమకు ఇష్టం వచ్చిన ప్రొవైడర్‌ సర్వీస్‌తో కార్డులు జారీ చేస్తున్నాయి.


2. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FDల గడువు పెంపు
పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్, తన కస్టమర్ల కోసం 'ఇండ్ సూపర్ 400' & 'ఇండ్ సుప్రీం 300 డేస్' పేరుతో ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను గతంలోనే ప్రారంభించింది, తాజాగా వాటి గడువును అక్టోబర్ 31, 2023 వరకు పొడిగించింది. ఈ రెండు FD పథకాలపై సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఇండియన్‌ బ్యాంక్ ఆఫర్‌ చేస్తోంది.


3. IDBI అమృత్ మహోత్సవ్ FD స్కీమ్‌ పథకం
IDBI బ్యాంక్, తన కస్టమర్ల కోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో ప్రత్యేక FD పథకాన్ని రన్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌ కింద, కస్టమర్లకు సాధారణ FD కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తోంది. 375 & 444 రోజుల ప్రత్యేక FD పథకం ఇది. ఈ FD గడువు అక్టోబర్ 31, 2023తో ముగుస్తుంది. అంటే, ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని సంపాదించి పెట్టే ప్రత్యేక స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక నెల మాత్రమే మిగిలి ఉంది.


4. TCS నియమాలలో జరుగుతున్న మార్పులు
అక్టోబర్ 1 నుంచి TCS (Tax collection at source) రూల్స్‌లో పెద్ద మార్పు ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల్లో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే; లేదా ఫారిన్‌ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో అసెట్స్‌ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే... అప్పుడు TCS చెల్లించాలి. విదేశాల్లో రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 20 శాతం వరకు టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.


5. SBI వికేర్‌ స్కీమ్‌
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ SBI, సీనియర్ సిటిజన్ల కోసం 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి ప్రత్యేక FD పథకాన్ని రన్‌ చేస్తోంది. ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. బ్యాంకు ఈ పథకాన్ని పొడిగిస్తుందని మార్కెట్‌ భావిస్తోంది. అయితే, దీనిపై బ్యాంకు అధికారికంగా ఇంకా సమాచారం ఇవ్వలేదు. కాబట్టి, ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజే ఆ పని పూర్తి చేయండి.


6. LIC పాలసీల రివైవల్‌ క్యాంపెయిన్‌
మీ LIC పాలసీ లాప్స్ అయితే, దాన్ని పునఃప్రారంభించేందుకు మీకు సువర్ణావకాశం ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023 సెప్టెంబర్ 1 - అక్టోబర్ 31 మధ్య కాలంలో స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌ చేపట్టింది. కొంత పెనాల్టీని చెల్లించడం ద్వారా, లాప్స్ అయిన మీ ఎల్‌ఐసీ పాలసీని మళ్లీ స్టార్ట్‌ చేయవచ్చు.


7. రూ.2000 నోట్లు మార్చుకునే గడువు
మీ దగ్గర 2 వేల రూపాయల నోట్లు ఉంటే, మీరు ఈ నెలలోనే వాటిని మార్చుకోవాలి. ప్రజలు తమ వద్ద ఉన్న పింక్‌ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబర్ 30, 2023 వరకే ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. ఈ గడువు పొడిగింపుపై ఎలాంటి సమాచారం లేదు.


మరో ఆసక్తికర కథనం: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial