Kim Putin Meeting: 


పుతిన్, కిమ్ భేటీ..


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు సంచలన నేతలు ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని సమర్థించారు. పశ్చిమ దేశాలతో పుతిన్‌ చేస్తోంది పవిత్ర యుద్ధం అని కితాబునిచ్చారు. ఉత్తర కొరియా, రష్యా కలిసి పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాయని తేల్చి చెప్పారు. 


"రష్యా తమ భద్రత గురించి పోరాడుతోంది. తమ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోంది. ఇది కచ్చితంగా పవిత్ర యుద్ధమే. ఆధిపత్యవాదాన్ని అణిచివేస్తాం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీసుకునే ప్రతి నిర్ణయానికీ మేం మద్దతునిస్తాం"


- కిమ్‌ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు 






ఎందుకు కలిశారో..? 


ఈ రెండు దేశాలు అమెరికాకి సవాలుగా మారాయి. దక్షిణ కొరియా, అమెరికా కలిసి ఉత్తర కొరియాని దెబ్బ కొట్టేందుకు చూస్తున్నాయి. అసలు ఈ ఆలోచనే రాకుండా పదేపదే మిజైల్స్‌ని లాంఛ్ చేస్తూ యుద్ధానికి సిద్ధమే అన్న సంకేతాలిస్తున్నారు కిమ్. ఇలాంటి కీలక తరుణంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల తరవాత తొలిసారి దేశం దాటి బయటకు వచ్చారు కిమ్. 2020లో కొవిడ్ సంక్షోభం రాగా అప్పటి నుంచి కాలు బయటపెట్టలేదు. సాధారణంగానే ఆయన చాలా తక్కువగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. 2018లో ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే..ఈసారి రష్యా రావడంపై ఉత్కంఠ పెరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న సైనిక చర్యకు అన్ని విధాలుగా సహకరిస్తోంది ఉత్తరకొరియా. పెద్ద ఎత్తున ఆయుధాలనూ సరఫరా చేస్తోంది. రాకెట్స్‌నూ సప్లై చేస్తోంది. ఈ రెండు దేశాల టార్గెట్ అమెరికాయే. అందుకే ఇంతగా మైత్రిని కొనసాగిస్తున్నాయి. పైగా ఉత్తర కొరియా ఆయుధాలను సప్లై చేస్తుండటం రష్యాకి కలిసొస్తోంది. ఇక ఉత్తర కొరియా విషయానికొస్తే...ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా తరవాత కుదుపులకు లోనైంది. ఆహార కొరత సమస్యను తీర్చేందుకు రష్యా సహకారం తీసుకోవాలని భావిస్తోంది ఉత్తర కొరియా. ఇదే సమయంలో దక్షిణ కొరియా, అమెరికా కలిసి మిలిటరీ డ్రిల్స్ చేస్తుండడంపైనా పుతిన్‌తో చర్చించినట్టు సమాచారం. ఎలాగైనా ఆ రెండు దేశాలను దారికి తీసుకురావాలని కిమ్ గట్టిగానే పుతిన్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. మిలిటరీకి సంబంధించిన ఒప్పందాలపైనే ఇద్దరు నేతలూ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కిమ్‌ ఓ బులెట్ ప్రూఫ్ ట్రైన్‌లో రష్యాకి వెళ్లారు. 


Also Read: సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం, ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చ!