Covid 19 in North Korea: ఉత్తరకొరియాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 2.7 లక్షల మందికి వైరస్‌ సోకింది. ఆరుగురు చనిపోయారు. దేశంలో కరోనా పరీక్షల కిట్లు లేకపోవడంతో జ్వరం కేసులన్నింటినీ కరోనా కేసులుగానే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 




మిలిటరీ


కరోనా వ్యాప్తి తీవ్ర దశకు చేరినందున ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ రంగంలోకి దిగారు. ఆరోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు మందుల పంపిణీ చేసేందుకు మిలిటరీని ఉపయోగిస్తున్నారు.


వైరస్‌ కట్టడిలో విఫలమైన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కిమ్​. ఆరోగ్య శాఖాధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


నో కిట్స్


ఉత్తర కొరియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 62కు చేరింది. కరోనా వ్యాప్తి ప్రభుత్వం వెల్లడించిన వివరాల కన్నా తీవ్రంగానే ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఉత్తర కొరియాలో ప్రస్తుత పరిస్థితులు కేవలం శాంపిల్ అని కరోనా అక్కడ పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర కొరియాలో ఆరోగ్య వ్యవస్థ సరిగాలేకపోవడం అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పౌరులకు వ్యాక్సిన్ అందజేయడంలోనూ కిమ్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.


లాక్‌డౌన్


కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కిమ్ జాతీయ స్థాయి లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్‌ కోర్‌ను కిమ్ రంగంలోకి దింపారు. ప్యాంగ్యాంగ్‌ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.


గతేడాది పలు దేశాలు ఉత్తరకొరియాకు ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను ఆఫర్‌ చేశాయి. కానీ, ఉ.కొరియా మాత్రం లాక్‌ డౌన్‌, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరి కిమ్ జోంగ్ ఉన్ ఏం చేస్తారో చూడాలి.


Also Read: Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!


Also Read: Karti Chidambaram: వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ అరెస్ట్