North Korea Coronavirus Cases:
ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు నమోదైెంది. ఈ మేరకు కిమ్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టించినప్పటికీ ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. కానీ ఎట్టకేలకు తాజాగా అక్కడ కూడా కరోనా కేసు నమోదైంది. దీంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎమెర్జెన్సీ
దేశంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో కిమ్ తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించిందని.. దీంతో వైరస్ వ్యాప్తిచెందకుండా అధ్యక్షుడు కిమ్ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారని ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అధికారులు ప్రకటించారు.
కరోనా బాధితుడికి దగ్గర ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచాలని ఆదేశించారు అధికారులు. కరోనాను లైట్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
రాజధాని ప్యోంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సోకిందని తేలింది.
2020, జనవరి 3 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తరకొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ లెక్కలు చెబుతున్నాయి.
మాస్క్‌తో కిమ్
కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ మాస్క్ ధరించని కిమ్.. ఎట్టకేలకు మాస్కుతో కనిపించారు. ఇటీవల జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో మాస్కుతో కనిపించారు. అంతేకాదు మిగిలిన నేతలు మాస్కులు అసలు తీయలేదు. దీంతో కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా కరోనా భయపెట్టిందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: WhiteHat Jr Employees Resign: 800 మంది ఉద్యోగులు రాజీనామా- ఆఫీసుకు రమ్మంటే అట్లుంటది మరి!
Also Read: Corona Cases: దేశంలో మరో 2,827 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?