చైనాలో నుంచి పెను ప్రమాదం సంభవించింది. టిబెట్ ఎయిర్‌లైన్స్ జెట్ విమానంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానం అదుపు తప్పి రన్‌ వే పై నుంచి జారిపోయింది. విమానంలో 113 మంది ప్రయాణికులతో పాటు తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ప్రమాదానికి గురైన ప్రయాణికుల విమానం టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. టిబెట్‌కు వెళ్లేందుకు సిద్ధమైన టీవీ 9833 అనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు టిబెటన్ విమానయాన సంస్థ తెలిపింది.


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం TV 9833 పశ్చిమ చైనాలోని చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ఈ రన్‌ వే ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 






స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV సంస్థ కథనం ప్రకారం.. గురువారం ఉదయం పోస్ట్ చేసిన వీడియో ఫుటేజీలో చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం టార్మాక్‌పై టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం నుండి మంటలు, నల్లటి దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు కనిపించింది. ఈ సమయంలో ప్రయాణికులు విమానం వెనుక డోర్ నుండి బయటకు వెళ్లడం కనిపిస్తోంది. విమానంలోని మంటలను ఆర్పివేశామని, రన్‌ వేను తాత్కాలికంగా ఎయిర్ పోర్టు అధికారులు మూసివేశారని సీసీటీవీ సంస్థ తెలిపింది. 


మొత్తం 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు టిబెట్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో పోస్ట్ చేసింది. మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.