సంక్షోభ పరిస్థితుల్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు తలను తూటాలతో చిద్రం చేసిన ఘటన ఇజ్రాయెల్‌లో చోటు చేసుకుంది. పాకిస్తానీ-అమెరికన్ జర్నలిస్ట్ షిరీన్‌ అబు అఖ్లే అల్‌జజీరా చానల్ తరపున ఇజ్రాయెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జెనిన్‌   వెస్ట్‌బ్యాంక్‌లో ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దళాలు దాడులకు దిగుతున్నాయి. వీటిని షిరీన్‌ అబు అఖ్లే కవర్ చేస్తున్నారు.  బుధవారం కూడా ఈ ఘర్షణలను కవర్‌ చేస్తుండగా   కాల్పుల్లో షిరీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  



ఘటన సమయంలో జర్నలిస్ట్ షిరీన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించారని, దానిపై ప్రెస్‌ అని కూడా రాసి ఉందని తెలిపింది. ఇజ్రాయెల్‌ సైన్యం ఉద్దేశపూర్వకంగానే ఆమెపై కాల్పులు జరిపారని, ఇది దారుణ హత్య అని పేర్కొంది.  షిరీన్‌ ప్రెస్‌ వెస్ట్‌, హెల్మెట్‌ ధరించారని, అయితే ఆమె తలపై తుపాకీతో కాల్చడంతో మరణించారని ఖతార్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆరోపిస్తున్నారు. అయితే పాలస్తీనా తిరుగుబాటుదారులే ఆమెను కాల్చి ఉంటారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని  ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. అయితే కాల్పులు జరిగిన ప్రాంతంలో పాలస్తీనియా తిరుగుబాటుదారులు లేరని అల్‌ జజీరా ప్రతినిధులు చెబుతున్నారు.  ఇజ్రాయిల్‌ సైన్యమే మాపై కాల్పులు జరిపిందని వారు ఆరోపిస్తున్నారు. 



వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగం కోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయిల్‌, పాలస్తీనా చారిత్రాత్మక ప్రాంతమైన జెనిన్‌లో ఇజ్రాయిల్‌ సైన్యం ఇటీవల దాడులను తీవ్రతరం చేసింది. ఇలాంటి చోట్ల విధులు నిర్వహించడం అత్యంత కఠినంగా ఉంటుంది. అయినా షిరీన్‌ అబు అఖ్లే  సాహసోపేతంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. కానీ ఆమెను అత్యంత దారుణంగా హతమార్చడం సంచలనం అవుతోంది.