European Parliament: ఐరోపా పార్లమెంటులో జరిగిన డ్యాన్స్ కార్యక్రమంపై ప్రజలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. "ఐరోపా భవిష్యత్ ఇదేనా" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ కళాప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


ఏం జరిగింది?


ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఐరోపా సమాఖ్య (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఐరోపా భవిష్యత్‌పై ఇందులో నేతలు సమాలోచనలు చేశారు. సమావేశాల చివరి రోజైన సోమవారం పౌరుల సూచనల ఆధారంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న దానిపై చర్చించారు.






అయితే సమావేశాల చివర్లో పది నిమిషాల పాటు పార్లమెంటులో కొందరు నృత్య ప్రదర్శన చేశారు. ఈ వినోదాత్మక కార్యక్రమాలు సభ్యులతోపాటు ఇతరులను షాక్‌కు గురి చేశాయి. 


మేక్రాన్  అసహనం


తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఇది నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.


ఈ డ్యాన్స్ ప్రదర్శన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా ఐరోపా పార్లమెంట్‌ తీరుపై మండిపడ్డారు. "యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) భవిష్యత్తు ఇదేనా" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "ఇది హాస్యాస్పదం. ఈయూతో బ్రేకప్‌ పట్ల సంతోషంగా ఉంది" అంటూ బ్రిటన్‌కు చెందిన మరొకరు కామెంట్‌ చేశారు. "ప్రజల భవిష్యత్తును నిర్ణయించాల్సిన చట్ట సభలు ఇలా తయారయ్యాయి, ఈ కార్యక్రమం అవసరమేంటి" అంటూ మరొకరు కామెంట్ చేశారు.


Also Read: Marital Rape: భార్యపై బలవంతపు శృంగారంపై దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?


Also Read: Assam CM Says PM Amit Shah: అమిత్ షాను ప్రధానిని చేసిన అసోం సీఎం! మోదీకి ఏ పోస్ట్ ఇచ్చారంటే?