New York Gun Law: అమెరికాలో గన్ కల్చర్‌కు ఆంక్షలు విధించాలని తలచిన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు షాక్ తగిలింది. న్యూయార్క్ పౌరులు తుపాకుల్ని తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు.
ఆ చట్టం రద్దు
ఈ సందర్భంగా గన్ కల్చర్‌కు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం తెచ్చిన న్యూయార్క్ గన్ చట్టాన్ని సుప్రీం కొట్టివేసింది. టెక్సాస్, న్యూ యార్క్, కాలిఫోర్నియాల్లో వరుస కాల్పుల ఘటనలు జరగడంతో బైడెన్ సర్కారు తుపాకుల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. ఈ దశలో సుప్రీం ఇలాంటి తీర్పు ఇచ్చింది.
చట్టంలో ఏముంది?
న్యూయార్క్ తుపాకీ చట్టం ప్రకారం సాధారణ పౌరులు.. తుపాకీలు తమ వెంట తీసుకువెళ్లాలంటే సరైన కారణం, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రత్యేక అవసరమా? లేదంటే ఆత్మ రక్షణ అన్న విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాలి.
బైడెన్ నిరాశ
అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ నిరాస చెందారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, కామన్‌సెన్స్‌కు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఈ తీర్పు అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా ఉందన్నారు. అయితే తీర్పు ఎలా ఉన్నా.. రాష్ట్రాలు మాత్రం తమ తమ పరిధిలో తుపాకీ నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తద్వారా కాల్పుల నేరాలకు కట్టడి వేయాలని బైడెన్ కోరారు.
ఆ బిల్లుకు ఆమోదం
సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా బైడెన్ సర్కార్ మాత్రం గన్ వయలెన్స్ కట్టడికి మరో ముందడుగు వేసింది. గురువారం రాత్రి ద్వైపాక్షిక గన్ సేఫ్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా సెనేట్. ప్రస్తుతం ఈ బిల్లు ఓటింగ్‌కు వెళ్లాల్సి ఉంది.
Also Read: Corona Cases: కరోనా ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా? కొత్తగా 17 వేలకు పైగా కేసులు
Also Read: Maharashtra Political Crisis: థాక్రే ప్రభుత్వం కుప్ప కూలినట్టేనా, షిండే శిబిరాన్ని ఎవరూ కదపలేరా?