షిండే శిబిరంలోకి పెరుగుతున్న వలసలు
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పతనం అంచుకు చేరుకోగా, అటు షిండేక్యాంప్‌లో అంతకంతకూ బలం పెరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆయన శిబిరంలోకి వెళ్లిపోతున్నారు. ఇటు శివసేన మాత్రం తమను తాము మహాశక్తిగా అభివర్ణిస్తూ ఎదురు దాడికి దిగుతున్నాయి. కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లిపోవటం వల్ల థాక్రే ప్రభుత్వం కుప్పు కూలక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ షిండే డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు గురువారం అర్ధరాత్రి లేఖ రాశారు. షిండేని శివసేన లెజిస్లేచర్ పార్టీకి అధ్యక్షుడిగా, భరత్‌షేట్ గోగవాలేని చీఫ్ విప్‌గా నియమించాలని అందులో ప్రస్తావించారు. ఈ మేరకు షిండే శిబిరంలోని అందరు ఎమ్మెల్యేలు తమ ఆమోదాన్ని తెలుపుతూ లేఖలో సంతకాలు చేశారు.
మాపై ఎవరూ వేటు వేయలేరు: షిండే
అటు శివసేన ఎదురు దాడికి దిగింది. పార్టీ నిబంధనలు ఖాతరు చేయకుండా షిండే శిబిరంలోకి వెళ్లిపోయిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యుటీ స్పీకర్‌ను కోరింది. అయితే ఈ విషయమై అటు షిండే కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. తాము చట్ట ప్రకారమేనడుచుకుంటున్నామని, ఎవరూ తమపై వేటు వేయలేరని కచ్చితంగా చెబుతున్నారు. షిండే ఇంత ధీమాగా ఉండటానికి కారణం లేకపోలేదు. క్రమక్రమంగా మరో నలుగురు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. షిండే శిబిరంలోని ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అంత ధీమాగా ఉన్నారు. పైగా ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఒకే మాట వినిపిస్తున్నారు. "శివసేనతో విసిగిపోయాం. అపాయింట్‌మెంట్ కోసం ఎన్నో సార్లు తిరగాల్సి వచ్చేది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే గౌరవం లేకుండా పోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు వారంతా.
కొందరు శివసేన ఎమ్మెల్యేలను షిండే బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపణలూ వస్తున్నాయి. ఈ విషయంలోనూ స్పష్టతనిస్తున్నారురెబల్ లీడర్ ఏక్‌నాథ్. ఎమ్మెల్యేలు తమంతట తాముగానే వచ్చి తనతో చేతులు కలుపుతున్నారని, ఇందులో ఎలాంటి ఒత్తిడి కానీ బల ప్రయోగం కానీ లేదని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో బలపరీక్షకు రమ్మని పిలిస్తే తప్పకుండా వెళ్తామని షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ కుట్ర వెనక భాజపా ఉందన్న ఆరోపణలపైనా వీళ్లు స్పందిస్తున్నారు. తాము బాల్ థాక్రే సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నామని, ఏ పార్టీ తమను వలలో వేసుకోలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఇలా మాటల యుద్ధం నడుస్తోంది. ఏదేమైనా ఏదో అద్భుతం జరిగితే తప్ప థాక్రే ప్రభుత్వం కుప్పు కూలకుండా ఉంటుంది.