పిల్లలు పుట్టకపోవడానికి భార్యా లేదా భర్త ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు. ఎంత ప్రయత్నిస్తున్నా పిల్లల పుట్టకపోవడం అనేది సమస్యే. దీన్ని ‘ఇన్ ఫెర్టిలిటీ’ అంటారు. తెలుగు దీన్నే వంధ్యత్వం అని పిలుస్తారు. స్త్రీలలో అయితే పీసీఓడీ వంటి సమస్యలు, అదే మగవారిలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గడం, ఊబకయాం, అధిక ప్రొలాక్టిన్, హైపోగోనాడిజం వంటి సమస్యల వల్ల పిల్లలు కలగడం కష్టంగా మారుతుంది. ఇలాంటి అంతర్లీనంగా ఉన్న కారణాల వల్లే ఇన్ ఫెర్టిలిటీ వస్తుంది. ఇది బయటికి కనిపించే లేదా నొప్పి ద్వారా తన లక్షణాన్ని తెలియజేసే సమస్య కాదు. అందుకే ఆలస్యంగా గుర్తించడం జరుగుతుంది. దీనికి యోగా, ప్రకృతి వైద్యం ద్వారా కొంతమేరకు మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు నిపుణులు.


వీటి వల్లే...
వంధ్యత్వానికి కారణమయ్యే కొన్ని కారకాలు వయసు పెరిగాక పిల్లల్ని కనేందుకు ప్రయత్నించడం, ధూమపానం, మద్యపానం, అధికంగా కెఫీన్ ఉండే పదార్థాలు తినడం లేదా తాగడం, అధికంగా బరువు పెరగడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, బి12 లోపించడం, అవసరానికి మించి వ్యాయామాలు చేయడం, విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ ఇన్ ఫెర్టిలిటీని పెంచుతాయి. 


నేచురోపతిలో ఇలా...
ప్రకృతివైద్యం ద్వారా వంధ్యత్వాన్ని నివారించవచ్చని చెబుతున్నారు ఆ రంగంలోని నిపుణులు. జీవనశైలిని ఆరోగ్యంగా మార్చడం ద్వారా పిల్లలు కలిగే అవకాశాలను పెంచుతామని అంటున్నారు. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెబుతున్నారు. తద్వారా శరీరం, మనస్సు గర్బం దాల్చేందుకు సిద్ధంగా మారతాయి. ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కూడా పిల్లలు పుట్టే అవకాశాలను పెంచుతారు. చెడు జీవనశైలి కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తాయని నమ్ముతోంది నేచురోపతి. శరీరానికి ఒక ఛాన్సు ఇస్తే మళ్లీ తనను తాను ఆరోగ్యంగా మార్చుకోగలదని, అది నేచురోపటి పద్ధతిలో సాధ్యమవుతుందని చెబుతున్నారు. 


యోగా ద్వారా ఇలా...
ఆడవారిలో గర్భం దాల్చకపోవడానికి సాధారణ కారణాలు పిసీవోడీ, హార్మోన్ల అసమతుల్యత. ఈ రెండింటినీ యోగా థెరపీ ద్వారా తగ్గించవచ్చని అంటున్నారు యోగా నిపుణులు. పంచకోశ సిద్ధాంతం ప్రకారం యోగా సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసి ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతాయి. ఉద్రేకపూరితమైన మనస్సు, శరీరం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఇన్‌ఫెర్టిలిటీకి కారణం అవుతుంది. యోగ థెరపీలో ఈ ఉద్రేకాన్ని, ఇతర మానసిక సమస్యలను తొలగించి, శరీరంలోని అన్ని క్రియలు సక్రమంగా జరిగేలా చేయవచ్చు. దీనివల్ల గర్భం దాల్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.ఇది స్త్రీ పురుషులిద్దరికీ అవసరం. 


Also read: నడుములోతు నీళ్లలో అప్పుడే పుట్టిన బిడ్డను బుట్టలో మోసుకెళ్తున్న తండ్రి, ఈ వీడియో చూడాల్సిందే



Also read: మగవారిలో కోరికలు పెంచే హార్మోన్ టెస్టొస్టెరాన్, అది తగ్గితే కనిపించే లక్షణాలు ఇవే